- నవంబర్ లో ఉమ్మడి జిల్లాలో రూ.52 కోట్ల లాభాలు
- పెళ్లిళ్లు, టూర్ల ఆఫర్లతో నష్టాల నుంచి లాభాల్లోకి
- మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్ వినియోగించుకుంటున్న మహిళలు
నల్గొండ, వెలుగు : ఆర్టీసీకి కార్తీక మాసం కలిసొచ్చింది. కార్తీక మాసం సందర్భంగా శైవ భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో ఈ ఏడాది ఆర్టీసీ లాభాల బాట పట్టింది. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు, శబరి మాలై యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను అందించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో రూ.52.27 కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. అంతేకాకుండా మహాలక్షి పథకం భాగంగా మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించడంతో ఈసారి ఎక్కువగానే లాభాలను తెచ్చిపెట్టాయి.
ప్రత్యేక ప్యాకేజీలు..
కార్తీక మాసంలో భక్తుల కోసం ప్రత్యేకంగా పంచారామాలు, అరుణాచలంతోపాటు వివిధ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులను నడిపింది. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, యాదగిరిగుట్ట డిపోల నుంచి నవంబర్ 13న అరుణాచలానికి స్పెషల్ బస్సులను నడపడం ద్వారా రూ.5.70 లక్షల ఆదాయం వచ్చింది. నవంబర్ 3,10,17,24 తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల నుంచి 28 బస్సులు నడపగా రూ.21.13 లక్షల ఆదాయం వచ్చింది.
పంచారామాలు, అరుణాచలం బస్సుల ద్వారా రూ.26,82,846 ఆదాయం వచ్చింది. వీటిలో దేవరకొండ డిపో నుంచి 8 బస్సులను నడిపించగా రూ.6.10 లక్షలు, నల్గొండ డిపో నుంచి 8 బస్సులు నడిపించగా రూ.7.48 లక్షలు, మిర్యాలగూడ డిపో నుంచి 8 బస్సులకు రూ.6.17 లక్షలు, యాదగిరిగుట్ట డిపో నుంచి 2 బస్సులకు రూ.2.32 లక్షలు, సూర్యాపేట డిపో నుంచి 5 బస్సులకు రూ.4.18 లక్షల ఆదాయం వచ్చింది.
అత్యధికంగా సూర్యాపేట డిపో..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నవంబర్ లో అత్యధిక ఆదాయం వచ్చిన డిపోల్లో సూర్యాపేట మొదటి స్థానంలో నిలిచింది. నవంబర్ లో మొత్తం సూర్యాపేట డిపో నుంచి 17.46 లక్షల మంది ప్రయాణించడంతో రూ.10.52 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత స్థానంలో దేవరకొండ డిపో నుంచి 14.80 లక్షల మంది ప్రయాణించగా రూ.9.10 కోట్లు, నల్గొండ డిపో నుంచి 13.73 లక్షల మందికి రూ.8.72 కోట్లు
మిర్యాలగూడ డిపో నుంచి 13.36 లక్షల మందికి రూ. 8.08 కోట్లు, యాదగిరి గుట్ట డిపో 12.97 లక్షల మందరికి రూ.8.06 కోట్లు, కోదాడ డిపో నుంచి 10.27 లక్షల మందికి రూ.6.76 కోట్లు, నార్కెట్ పల్లి డిపో నుంచి 2.53 లక్షల మంది ప్రయాణించడంతో రూ.1.09 కోట్ల ఆదాయం వచ్చింది.
కలిసొచ్చిన శుభకార్యాలు..
నవంబర్ లో కార్తీక మాసం రావడంతో ఆర్టీసీకి కలిసొచ్చింది. ప్రత్యేకంగా పెళ్లిళ్లకు బస్సులను బుక్ చేసుకుంటున్న వారికి రాయితీలను ప్రకటించడంతో ఎక్కువగా ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో మహిళలు ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. అంతేకాకుండా అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తుండడంతో ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది.