ఆర్టీసీకి సంక్రాంతి రష్ .. ఏపీకి ఆన్​లైన్​లో రిజర్వేషన్లు ఫుల్​

  • ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్న ఆంధ్రా ప్రజలు 
  • హైదరాబాద్​ నుంచి 3 వేలకుపైగా అదనపు బస్సులు 
  • రద్దీకి అనుగుణంగా ఇంకా పెంచే చాన్స్

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో హైదరాబాద్  సిటీలోని ఏపీ వారు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆన్‌‌లైన్ లో బస్  టికెట్లను రిజర్వు చేసుకుంటున్నారు. సిటీ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు వంటి రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 3 వేలకు పైగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారులు సమావేశం కానున్నారు. గత సంవత్సరం రద్దీని పరిగణనలోకి తీసుకొని ఈ సంవత్సరం అదే స్థాయిలో అదనపు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకోనున్నారు.

 పండుగ సమీపిస్తున్న కొద్దీ ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వీలైనన్ని బస్సులు పెంచేందుకు కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలోని వివిధ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ కూడా ఎక్కువగానే ఉన్నందున సిటీలో స్థిరపడిన ఆంధ్రా జనంలో సగం మంది రైళ్లలో వెళ్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ గత సంవత్సరం రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇక, మన రాష్ట్రంలో కూడా సంక్రాంతి రద్దీ ఎక్కువగానే ఉండనుంది. 

ALSO READ : గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్.. మిషన్​ భగీరథకు టోల్ ​ఫ్రీ నంబర్

హైదరాబాద్  నుంచి కరీంనగర్  వంటి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ లేకపోవడంతో ఈ రూట్ లో ప్రయాణికులు తమ ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి రూట్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు తిప్పడంపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంతో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయనుండడంతో ఈసారి రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ రూట్ లో ఎన్ని అదనపు బస్సులను తిప్పాలో  ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా డిపోల మేనేజర్ల నుంచి సమాచారం తెప్పించుకున్నారు.