లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులకు గాయాలు

మెదక్: కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజూమున సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు.

ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు, లారీ ఢీకొనడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.