- 5 కోట్లు దాటిన జీరో కరెంటు బిల్లులు
- నెలకు ఒక్కో కుటుంబానికి వెయ్యి ఆదా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ‘గృహ జ్యోతి’ పథకం వరంలా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ప్రకటించిన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే అమలు చేస్తుండడంతో 50 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం కలుగుతున్నది. ఆరు గ్యారెంటీ హామీల్లో కీలకమైన గృహజ్యోతి స్కీమ్‌ను ప్రభుత్వం 2024 మార్చి 1 నుంచి అమలు చేస్తున్నది. ఈ పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్వినియోగించే లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లు వస్తున్నది. ప్రస్తుతం ఈ పథకం కింద లబ్ధిపొందే వారి సంఖ్య 50 లక్షలకు పైగా ఉన్నది. ఇందులో సదరన్ డిస్కంలో 26 లక్షల వరకు ఉండగా, నార్తర్న్ డిస్కంలో 24 లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ రెండు డిస్కంలు జీరో కరెంట్ బిల్లులు ఇస్తున్నాయి. మార్చి నుంచి డిసెంబర్‌నాటికే గత పది నెలల్లో ఉచిత కరెంటు పథకంలో దాదాపు రూ. 5 కోట్లకు పైగా జీరో విద్యుత్ బిల్లులు జారీ కావడం విశేషం. ఈ నెల 24 నాటికి బిల్లింగ్ పూర్తయితే 5 కోట్లకుపైగా జీరో బిల్లులు జారీ అయ్యే అవకాశం ఉన్నది.
పేద, మధ్య తరగతి వర్గాలకు రూ.1,550 కోట్ల వరకు లబ్ధి
రాష్ట్రంలో అర్హత పొందిన 50 లక్షలకు పైగా ఉన్న గృహజ్యోతి లబ్ధిదారుల్లో యావరేజీగా నెలకు 40.50 లక్షల మంది కరెంటును పొదుపుగా వాడుకుంటున్నారు. మరికొంత మంది అప్పుడప్పుడు 200 యూనిట్లు దాటేస్తున్నారు. దీంతో నెలకు యావరేజీగా దాదాపు రూ.150 కోట్ల వరకు జీరో బిల్లులు జారీ అవుతున్నాయి. ఈ నెల బిల్లులు దాదాపు రూ.200 కోట్లకు పైగా వచ్చాయి. మొత్తంగా గత నవంబరు నెల వరకే రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,336 కోట్ల బిల్లులు జారీ అయ్యాయి. తాజాగా జారీ అయిన వాటితో కలిపి రాష్ట్రంలోని సామాన్య, పేద, మధ్యతరగతి విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతి పథకం ద్వారా రూ.1,550 కోట్ల వరకు లబ్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో గృహ జ్యోతి అమలుకోసం రూ.2,418 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే.
ఒక్కో కుటుంబానికి వెయ్యి ఆదా
విద్యుత్ చార్జీలను స్లాబులవారీగా వసూలు చేస్తారు. వంద యూనిట్లలోపు కరెంటు వాడే వారికి 0–50 యూనిట్లలోపు యూనిట్‌కు రూ.1.95 ఉండగా, 51– 100 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్ కు రూ.3.10 కరెంట్ టారీఫ్ అమల్లో ఉన్నది. అలాగే, 100–200 యూనిట్ల వరకు కరెంటు వాడే గృహ వినియోగదారులకు 0–100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.40, 101–200 యూనిట్ల వరకు రూ.4.80 చార్జీ వసూలు చేస్తున్నారు. 200 యూనిట్లకు పైగా వాడుకునే వారికి కరెంట్ ఎనర్జీ చార్జీలతో పాటు కస్టమర్, ఫిక్స్డ్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇతరత్రా చార్జీలు కలుపుకొని నెలకు దాదాపు వెయ్యికి పైగా కరెంట్ బిల్లు వస్తున్నది. గృహజ్యోతి పథకం అమలవుతున్న ప్రతీ పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాలు పొదుపుగా కరెంట్ వాడుకుంటే నెలకు ఈ వెయ్యి ఆదా అవుతున్నది.