రామరాజ్యం పేరుతో దాడులు చేస్తరా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల, వెలుగు: రామరాజ్యం పేరుతో మతపరమైన దాడులు చేస్తే సహించేది లేదని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. జన్వాడలో క్రైస్తవులపై జరిగిన దాడులకు నిరసనగా వాయిస్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం గద్వాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాముడు అందరి దేవుడు అయితే ఈ దేశంలో మతపరమైన దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులు ప్రణాళిక ప్రకారం జన్వాడలో క్రైస్తవులు, దళితులపై దాడులు చేశారని ఆరోపించారు.

రాజ్యాంగం లేకుంటే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవారా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని అధికరణ 25 ద్వారా మైనార్టీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జన్వాడ ఘటన కారంచేడు, చుండూరు లాంటిదేనని అభిప్రాయపడ్డారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను ఏ రాజకీయ పార్టీ కూడా ఖండించలేదని, కనీసం అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, కేశవరావు పాల్గొన్నారు.