కెనడాలో జాబ్ పేరిట రూ.8 లక్షల స్కామ్.. సిటీలోని వ్యాపారిని చీట్​చేసిన సైబర్​ నేరగాళ్లు

  •     ‘నౌకరి.కామ్’లో డేటా ఆధారంగా కాల్స్

బషీర్ బాగ్, వెలుగు :  కెనడాలో జాబ్స్​ఇప్పిస్తామంటూ సైబర్​నేరగాళ్లు సిటీకి చెందిన ఓ వ్యాపారిని చీట్​చేశారు. విడతల వారీగా అతని నుంచి రూ.8లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన వ్యాపారి(45) కుటుంబ సభ్యులతో విదేశాల్లో సెటిల్​అవుదామని అనుకుంటున్నాడు. అందుకోసం తన ప్రొఫైల్​తోపాటు, తన చెల్లి, ఆమె భర్త ఫ్రొఫైల్స్ ను ‘నౌకరి.కామ్’తోపాటు వేర్వేరు జాబ్​ఆఫర్​సైట్లలో అప్​లోడ్​చేశాడు. కాగా నాలుగు నెల కింద సదరు వ్యాపారికి సైబర్​నేరగాడు కాల్​చేశాడు. తాను డెలాయిట్ కంపెనీ రిక్రూటర్ ని అని పరిచయం చేసుకున్నాడు.

కెనడాలో ఉద్యోగాలు ఉన్నాయని, ప్యానెల్ మేనేజ్​మెంట్ ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఉంటాయని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన వ్యాపారి తన పాస్ పోర్టుతోపాటు అతని చెల్లి, ఆమె భర్త పాస్​పోర్టుల వివరాలు పంపించాడు. తర్వాత జాబ్ ప్రాసెస్ చేయాలంటే టోకెన్ అమౌంట్ కట్టాలని సైబర్​నేరగాడు డిమాండ్​చేశాడు. ఆ వెంటనే వ్యాపారి తనతోపాటు తన స్నేహితుడి అకౌంట్​నుంచి పలుమార్లు సైబర్​నేరగాడి అకౌంట్​కు రూ.8లక్షలు పంపించాడు.

ఆఫర్​లెటర్లు రిలీజ్​చేయకపోగా, అడిగిన ప్రతిసారి ఇంకా బెటర్​జాబ్​ఆఫర్ల గురించి చెబుతుండడంతో వ్యాపారి తాను మోసపోయానని తెలుసుకున్నాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీయగా తాను కెనడాలో ఉన్నానని సైబర్​నేరగాడు సాకులు చెప్పాడు. చివరికి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించాడు. చివరికి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.