పల్లె పనులకు యాక్షన్ ప్లాన్..ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి షురూ

  • రూ.2,750 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు శ్రీకారం 
  • మహిళల ఉపాధి, జల వనరుల పెంపు, రైతుల సమస్యల పరిష్కారం
  • వచ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేసేలా సర్కార్ నిర్దేశిత ప్లాన్

మెదక్, వెలుగు : గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్​ఆర్ఈజీఎస్)కింద మహిళల ఉపాధికి, జల సంరక్షణకు, రైతుల సమస్యలను పరిష్కరించే పనులు చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆయా పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)యాక్షన్​ప్లాన్​ రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉపాధి కూలీలు ఎక్కువ మట్టి పనులే చేస్తుండగా

 ఇకముందు చేపట్టబోయే వాటిలో వివిధ వర్గాలకు వ్యక్తిగత ప్రయోజనం కల్పించే, సహజ వనరులను పరిరక్షించి సద్వినియోగం చేసుకునే పనులకు ప్రాధాన్యత కల్పించారు. సెల్ప్​హెల్ప్​గ్రూప్​మహిళలకు ఉపాధి కల్పించే, రైతుల సమస్యలు తీర్చేలా వ్యవసాయ అనుబంధ పనులు, భూగర్భ జలాల పెంపుదలకు దోహదపడే పనులు, గ్రామాల్లో శానిటేషన్  మెరుగు,  పంచాయతీ, అంగన్​వాడీ సెంటర్​ లకు పక్కా భవనాల నిర్మాణ పనులు చేపట్టాలని ప్రతిపాదించింది. 

నిర్దేశిత పనులివే..

మహిళా శక్తి -ఉపాధి భరోసా కింద క్యాటిల్​షెడ్​, అజోలా కనస్ట్రక్షన్స్, వర్మీ, నాడెపు కంపోస్ట్​పిట్​లు, పౌల్ట్రీ షెడ్​లు, ఎస్సీ, ఎస్టీ రైతులు, ఆర్ వో ఎఫ్​ఆర్​ పట్టాల రైతుల భూముల్లో డెవలప్​మెంట్​ పనులు,  పొలం బాటల కింద రోడ్ల నిర్మాణం, వన మహోత్సవంలో హార్టికల్చర్​ప్లాంటేషన్, జల నిధి కింద భూగర్భ జలాలు పెంపునకు గల్లీ కంట్రోల్​వర్క్స్, చెక్​డ్యాంలు, ఫామ్ పండ్స్​, పర్క్యులేషన్​ ట్యాంక్​లు, రూప్ రెయిన్​వాటర్​ హార్వెస్టింగ్​స్ట్రక్చర్​లు

బోర్​వెల్​రీచార్జి స్ట్రక్చర్​లు, రూరల్ శానిటేషన్ కింద ఇరిగేషన్​ ఓపెన్​వెల్స్​, సోక్​ పిట్స్​, రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ కింద స్కూల్​టాయిలెట్స్​, సీసీ రోడ్లు​, పంచాయతీ, అంగన్​వాడీ బిల్డింగ్ నిర్మాణాలను చేపట్టాలని నిర్దేశించింది.  ఆయా పనులు చేపట్టేందుకు మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించి, అందుకు అవసరమైన నిధులు కేటాయించింది.  

‘పనుల జాతర’ పేరిట

జిల్లాల వారీగా నిర్దేశిత ఐదు నెలల పనుల ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్​గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​డీఆర్డీఓలకు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా డీఆర్డీఏ అధికారులు పనుల ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.   ప్రజా పాలన విజయోత్సవాల్లో  భాగంగా ‘పనుల జాతర’ పేరుతో మంగళవారం ఒకే రోజు అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. 33 జిల్లాల్లో రూ.2,750 కోట్ల పనులు చేపట్టనుండగా, వచ్చే ఏడాది మార్చి లోగా యాక్షన్​ప్లాన్​తయారు చేసుకుని పనులు కంప్లీట్ చేయాలని టార్గెట్ నిర్దేశించింది.