రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఫ్రీ.. ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ మరో హామీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ మరో కీలక హామీ ఇచ్చింది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‎ను గెలిపిస్తే.. జీవన్ రక్ష యోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఉచితంగా కల్పిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే బుధవారం (జవనరి 8) జీవన్ రక్ష యోజన పథకాన్ని అనౌన్స్ చేసింది. దేశ రాజధానిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోన్న కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది. 

తాజాగా జీవన్ రక్ష యోజన పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్.. దీనికంటే ముందు ‘ప్యారీ దీదీ యోజన’ స్కీమ్‎ను అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ పవర్‏లోకి వస్తే ఈ పథకం కింద ఢిల్లీలోని మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర యాదవ్,  మరికొందర కీలక నేతలు బుధవారం (జనవరి 8) జీవన్ రక్ష యోజన స్కీమ్‏ను ప్రకటించారు. ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..ఢిల్లీ కాంగ్రెస్ రాబోయే ఎన్నికల కోసం తన మేనిఫెస్టోలో 'జీవన్ రక్షా యోజన'ని చేర్చాలని నిర్ణయించిందని తెలిపారు.

ALSO READ | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న సీఈసీ

 ఈ పథకం కింద లబ్దిదారులకు రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ అందించబడుతుందని పేర్కొన్నారు. చిరంజీవి యోజన పేరుతో రాజస్థాన్‎లో కూడా ఇదే తరహాలో స్కీమ్ ప్రారంభించామని.. ఈ పథకం కింద 25 లక్షల ఆరోగ్య బీమా అందించామని తెలిపారు. ఢిల్లీలో కూడా జీవన్ రక్ష యోజన అదే విధంగా అమలు చేస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. చిరంజీవి యోజన స్కీమ్ రాజస్థాన్‌లో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని.. అలాగే జీవన్ రక్ష యోజన కూడా ఢిల్లీకి గేమ్ ఛేంజర్ స్కీమ్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం 2025, జవనరి 7వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. జనవరి 10వ తేదీన ఎన్నికల గెజిట్ విడుదల చేయనుండగా.. నామినేషన్ల దాఖలు చేసేందుకు చివరి తేదీ జనవరి 17 అని ఈసీ పేర్కొంది. జనవరి 18 నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 20 చివరి తేదీ. 2025, ఫిబ్రవరి 5న ఎన్నికలు, 8వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ వెల్లడించింది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియనున్నట్లు తెలిపింది.