దొంగ నోట్లు పెరిగినయ్.. ఆర్బీఐ నివేదికలో వెల్లడి

దొంగ నోట్లు పెరిగినయ్.. ఆర్బీఐ నివేదికలో వెల్లడి
  • ఆర్బీఐ నివేదికలో వెల్లడి
  • రూ.500 నోట్లలో 101.9%.. రూ.2000 నోట్లలో 54.16% మేర ఎక్కువైన నకిలీ కరెన్సీ    భారీగా పెరిగిన ఒరిజినల్​ 500 నోట్లు
  • చెలామణీలో 4,554.68 కోట్ల నోట్లు 

న్యూఢిల్లీ : దేశంలో దొంగ నోట్లు భారీగా పెరిగాయని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. 2021–2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఆర్బీఐ తయారు చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అన్నింట్లోకెల్లా 500 రూపాయల నోట్లలోనే ఎక్కువ దొంగనోట్లున్నట్టు ఆర్బీఐ రిపోర్ట్​ తేల్చింది. ఆ డినామినేషన్లలో దొంగ నోట్లు 101.9 శాతం మేర పెరిగినట్టు పేర్కొంది. 2000 రూపాయలకు సంబంధించి దొంగనోట్లు 54.16 శాతం ఎక్కువయ్యాయని వెల్లడించింది. 
500 నోట్లు ఎక్కువైనయ్​.. 


2000 నోట్లు తగ్గినయ్​
ఒరిజినల్​ 500 నోట్ల చెలామణీ బాగా పెరిగిపోయినట్టు ఆర్బీఐ రిపోర్ట్​ వెల్లడించింది. 2020–2021 ఆర్థిక సంవత్సరంలో 3,867.90 కోట్ల 500 నోట్లు చెలామణీలో ఉండగా.. 2021–2022 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 4,554.68 కోట్ల నోట్లు చెలామణీ అవుతున్నాయి. మొత్తం నోట్లలో అత్యధికంగా 500 నోట్ల వాటానే 34.9 శాతంగా ఉంది. ఆ తర్వాత 10 డినామినేషన్​ నోట్లు 21.3 శాతం ఉన్నాయి. అదేసమయంలో 2000 నోట్ల సంఖ్య తగ్గిపోయింది. 2020 మార్చి నాటికి 274 కోట్ల నోట్లుండగా.. ఇప్పుడు 214 కోట్లకు పడిపోయింది.  

 

ప్రతిపక్షాల విమర్శలు
దొంగనోట్లు పెరిగిపోయాయన్న ఆర్బీఐ నివేదికతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. నోట్ల రద్దు గుర్తుందా మోడీజీ? అంటూ తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ డెరెక్​ ఓబ్రయన్​ సెటైర్​ వేశారు. నోట్లను రద్దు చేస్తే దొంగ నోట్లన్నీ పోతాయంటూ ఇచ్చిన హామీ అయినా గుర్తుందా? అంటూ నిలదీశారు. దొంగ నోట్లు భారీగా పెరిగిపోయాయని ఆర్బీఐ నివేదిక చెప్తోందని విమర్శించారు. ‘‘నోట్ల రద్దుతో భలే లాభాలు కలుగుతున్నాయే! 2000 రూపాయల నోట్లలోని చిప్ కూడా బాగానే పనిచేస్తోందే!!’’ అంటూ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎద్దేవా చేశారు.

ఎకానమీని ముంచడంలో సక్సెస్ : రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం డీమానిటైజేషన్ ద్వారా ఎకానమీని విజయవంతంగా ముంచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో నకిలీ నోట్లు పెరగడం అనేది 2016లో మోడీ ప్రభుత్వం చేసిన డీమానిటైజేషన్ కు దక్కిన ‘దురదృష్టకరమైన విజయం’ అని ఆయన అభివర్ణించారు. రూ. 500, రూ. 2 వేల నోట్లలో ఫేక్ కరెన్సీ పెరుగుతోందంటూ ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని ట్యాగ్ చేస్తూ రాహుల్ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం : -

హర్యానాలో మాకు ఒక్క చాన్స్ ఇవ్వండి


బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల