రెండు రూపాయిల లంచం కేసు ... 37 ఏళ్లు విచారణ.. ఎక్కడంటే

రెండు రూపాయిల లంచం కేసు ... 37 ఏళ్లు విచారణ.. ఎక్కడంటే

సమాజంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంతో పని ఉంటుంది.  అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బులు   సంబంధిత అధికారులకు ముట్టజెప్పి  పనులు చేయించుకుంటారు.  అవి పనిని బట్టి వందల నుంచి వేల వరకు ఉంటుంది.  అయినా ఎక్కడొకచోట సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారు.  వారు లంచం తీసుకోరు.. కింది స్థాయి ఉద్యోగులు లంచం తీసుకుంటే ఊరుకోరు.. ఒక వేళ అలా తీసుకుంటే వారిపై కేసులు కూడా నమోదు చేసిన సందర్భాలు అనేకం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న కేసులు కోర్టుల్లో రెండు, మూడేళ్లలో తేలిపోతాయి.  మహా అయితే ఐదేళ్లు పడుతుంది.  కాని బీహార్ లోని ఐదుగురి పోలీసులపై నమోదైన కేసు ఏకంగా 37 ఏళ్లు విచారణ కొనసాగింది.  ఇంతకూ ఆ కేసులో ఎంత లంచం తీసుకున్నారో తెలిస్తే విస్తు పోతారు.  

బీహార్ లోని భాగల్‌పుర్‌ పరిధిలోని ఓ చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు పోలీసులు.. వాహనదారుల నుంచి రూ.2 లంచం వసూలు చేస్తున్నారని బెగుసరాయ్‌ ఎస్పీ అరవింద్‌ వర్మకు ఫిర్యాదులు అందాయి. 1986 జూన్‌ 10వ తేదీన ఒక వ్యక్తి నుంచి ఆయనకు ఈ ఫిర్యాదు అందింది. దీంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఎస్పీ భావించారు. అందుకు ఒక ప్రణాళిక రూపొందించారు. చెక్‌పోస్ట్‌ వైపుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపి.. రూ.2 నోటుపై తన సంతకం చేసి, ఆ నోటును డ్రైవర్‌‌కు ఇచ్చారు. ఒకవేళ పోలీసులు లంచం అడిగితే.. తాను సంతకం చేసిన నోటునే వారికి ఇవ్వాలని సూచించారు. అనంతరం.. వాహనదారుడు చెక్‌పోస్ట్‌ వద్దకు చేరుకోగానే.. పోలీసులు అతనికి రూ.2 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు ఆ డ్రైవర్ ఎస్పీ సంతకం చేసిచ్చి నోటుని ఒక కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాడు.

ఎట్టకేలకు తనకు వచ్చిన ఫిర్యాదు నిజమేనని నిర్ధారించుకున్న ఆ ఎస్పీ.. వెంటనే చెక్‌పోస్ట్‌ వద్దకు వెళ్లారు. కానిస్టేబుల్‌ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకొని.. ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. అలా 1986 నుంచి మొదలైన ఈ కేసు విచారణ.. 2023 ఆగస్టు దాకా సాగింది. చివరికి.. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసుని కొట్టివేస్తూ.. రామరతన్‌ శర్మ, కైలాష్‌ శర్మ, జ్ఞాని శంకర్‌, యుగేశ్వర్‌ మహ్తో, రామ్‌ బాలక్‌ రాయ్‌ అనే ఐదుగురు పోలీసుల్ని కోర్టు నిర్దోషులుగా తేల్చింది.

కొన్ని కేసుల విచారణలు ఎక్కువకాలం నడుస్తాయన్న విషయం అందరికీ తెలుసు. అవినీతి కేసులు కూడా కొన్ని సంవత్సరాల వరకు సాగుతాయి కానీ, మరీ 37 సంవత్సరాలు సాగిన దాఖలాలైతే లేవు. కానీ.. ఒక కేసు విచారణ మాత్రం అంత సుదీర్ఘకాలం వరకు నడిచింది. అది కూడా లక్షల్లో, కోట్లలో అవినీతి జరగలేదు. కేవలం రెండే రెండు రూపాయల అవినీతి జరిగిన కేసు అది. వాహనదారుల నుంచి ఐదుగురు పోలీసులు రూ.2 లంచం తీసుకున్నారని 1986లో నమోదైన ఈ కేసులో.. ఇన్నేళ్ల తర్వాత వాళ్లు నిర్దోషులంటూ బిహార్‌లోని ఒక కోర్టు తీర్పు ఇచ్చింది.