తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు రాయల్ వశిష్ఠ పున్నమి బోటు 38రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. గత నెల 15న 77మంది పర్యాటకులు పాపికొండల్లో పర్యటించేందుకు రాయల్ వశిష్ఠ పున్నమి బోటులో వెళ్లారు. ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడంతో 39మంది ప్రయాణికులు మృతి చెందారు. 26మంది సురక్షితంగా భయటపడ్డారు. 12మంది ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారి కోసం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బాధితుల ఆచూకీ కోసం ధర్మాడి సత్యం బృందంతో గాలింపు చర్యలు నిర్వహించింది. ఈ గాలింపు చర్యల్లో ధర్మాడి సత్యం బోటును వెలికి తీశారు.
బోటుతో పాటు ఏడు మృతదేహాల్ని వెలికితీశారు. నీటిలో మునిగిపోవడంతో మృతుల శరీర భాగాలు కుళ్లిపోయి.. దేహాల్ని గుర్తించడం కష్టంగా మారిందన్నారు. వెలికి తీసిన మృతదేహాలకు వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం తరువాత 7 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
గుర్తించిన మృతుల వివరాలు..
1) సంగడి నూకరాజు బోటు డ్రైవర్, కాకినాడ
2) పోతబత్తుల సత్యనారాయణ బోటు డ్రైవర్ కాకినాడ
3) కర్రి మణికంఠ బోటు సిబ్బంది పట్టిసీమ, ప.గో.జిల్లా
4) బసికి ధర్మరాజు పర్యాటకుడు, వరంగల్
5) సురభి రవీందర్ పర్యాటకుడు, నల్గొండ జిల్లా
6) కొమ్మల రవి పర్యాటకుడు, కడిపికొండ, వరంగల్ అర్బన్ జిల్లా
7) బసిరెడ్డి విఖ్యాత రెడ్డి (5) బాలుడు, నంద్యాల

