ENG vs PAK 1st Test: దిగ్గజాలను దాటేశాడు.. ముల్తాన్‍లో రూట్ రికార్డుల వర్షం

ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది. రెండో రోజు ఇంగ్లాండ్ కెప్టెన్ పోప్ వికెట్ మినహాయిస్తే పాకిస్థాన్ ను ఎలాంటి ఆనందం కలగలేదు. పాక్ బౌలర్లపై చెలరేగి ఆడుతూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. వచ్చినవారు వచ్చినట్టు పాక్ బౌలర్లను అలవోకగా ఆడేస్తున్నారు. మూడో రోజు టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 424 పరుగులు చేసింది. ముఖ్యంగా రూట్ (144)భారీ సెంచరీతో దూసుకుపోతున్నాడు. ముల్తాన్ టెస్టులో పలు రికార్డ్స్ బ్రేక్ చేసి దిగ్గజాల సరసన చేరాడు. ఈ మ్యాచ్ లో రూట్ బ్రేక్ చేసిన రికార్డ్స్ ఒకసారి పరీశీలిద్దాం 

టెస్టుల్లో అలెస్టర్ కుక్ రికార్డ్ బద్దలు కొట్టి ఇంగ్లాండ్ టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్నటివరకు ఈ రికార్డ్ కుక్ (12472) పేరిట ఉండగా.. నేడు ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అజేయ హాఫ్ సెంచరీతో రూట్ ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు.   

కుక్ రికార్డ్ బ్రేక్ చేసిన రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో టాప్ 5 లో చేరాడు. టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో టాప్ లో ఉన్నాడు. రికీ పాంటింగ్(13378), కల్లిస్(13289), రాహుల్ ద్రవిడ్ (13288) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
   
టెస్టు కెరీర్ లో 35 సెంచరీలతో దిగ్గజాలను దాటేశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఆరో స్థానానికి చేరాడు. యూనిస్ ఖాన్, జయవర్ధనే, బ్రియాన్ లారా, గవాస్కర్ 34 సెంచరీలు చేశారు. ఈ లిస్టులో సచిన్ 51 సెంచరీలతో అగ్ర స్థానంలో ఉన్నాడు. కల్లిస్(45),రికీ పాంటింగ్ (41),సంగక్కర (38), రాహుల్ ద్రవిడ్(36) తర్వాత స్థానాల్లో నిలిచారు.
 
ఒకే క్యాలండర్ ఇయర్ లో 1000 కి పైగా పరుగులు 5 సార్లు చేశాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో రూట్ టాప్. స్టీవ్ స్మిత్ నాలుగు సార్లు, విలియంసన్ రెండు సార్లు ఈ ఘనతను సాధించారు.