ENG vs PAK 1st Test: కుక్ రికార్డ్ బద్దలు.. ఇంగ్లాండ్ ఆల్‌టైం బెస్ట్ బ్యాటర్‌గా రూట్

స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో అలెస్టర్ కుక్ రికార్డ్ బద్దలు కొట్టి ఇంగ్లాండ్ టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర  సృష్టించాడు. నిన్నటివరకు ఈ రికార్డ్ కుక్ (12472) పేరిట ఉండగా.. నేడు ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అజేయ హాఫ్ సెంచరీతో రూట్ ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు. గత కొంతకాలంగా అత్యుత్తమ ఫామ్ లో ఉన్న రూట్ టెస్టుల్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రూట్ 72 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అతని టెస్ట్ కెరీర్ లో 12474* పరుగులు ఉన్నాయి. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు.

పాకిస్థాన్ బౌలర్లను అలవోకగా ఆడిస్తున్న రూట్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రూట్ తో పాటు బెన్ డకెట్ హాఫ్ సెంచరీ (80)తో క్రీజ్ లో ఉన్నాడు. పిచ్ బౌలర్లకు సహకారం అందించకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున వన్డే తరహాలో పరుగులు వస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో మరో 340 పరుగులు వెనకపడి ఉంది. మూడో రోజు ఆట కావడంతో ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయంగా కనిపిస్తుంది. 

Also Read:-అతనికి భయపడం.. మయాంక్ లాంటి బౌలర్లు మా దగ్గర ఉన్నారు

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్‌‌ (151), ఓపెనర్‌‌‌‌ అబ్దుల్లా షఫీక్‌‌ (102) అఘా సల్మాన్ (104) సెంచరీలతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ క్రాలీ (78), రూట్,  డకెట్ హాఫ్ సెంచరీలతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది.