రాష్ట్రానికి రావటానికే భయపడుతున్నాడు.. ఇంత గిఫ్ట్ ఏం ఇస్తాడు : మంత్రి రోజా

చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.. ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నారని.. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ పేరుతో దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని అన్నారు. భయాన్ని పరిచయం చేస్తానని ప్రగల్భాలు పలికిన లోకేష్ స్కాంలలో ఇరుక్కుని  ఢిల్లీ పారిపోయాడని.. కాళ్ళ నుంచి కళ్ళ వరకూ భయంతో  వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. 

కేసుల్లో అడ్డంగా దొరికి దొంగల్లా పారిపోయి ఢిల్లీలో దాక్కున వ్యక్తి రిటర్న్‌ గిఫ్టుల గురించి మాట్లాడటమా..? ఏపీకి రిటర్న్‌ రావడానికే భయపడుతున్న వ్యక్తి లోకేశ్‌ అనేది అందరి నోటా వినిపిస్తున్న మాటని ఏపీ మంత్రి రోజా అన్నారు.   ఎక్కడ ఎవరు తనను చూస్తారో.. ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనని గజగజ వణుకుతూ ఢిల్లీ రోడ్లమీద దొంగలా తిరుగుతున్న లోకేశ్‌ను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎర్రడైరీలో తనకు నచ్చని వారి పేర్లు రాసుకుంటానని నిన్నటిదాకా బెదిరించిన లోకేశ్‌ పేరేమో.. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లలో నమోదు అయిందని ఎద్దేవా చేశారు.