రోజ్మేళాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దాదాపు 70,000 మందికి పైగా నియామక పత్రాలను అందించారు. తమ ప్రభుత్వం బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, చిన్న బ్యాంకులను విలీనం చేయడం, వృత్తి నైపుణ్యాన్ని ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలను చేపట్టిందని మోదీ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఎక్కువ మంది బ్యాంకింగ్ రంగంలో ఉపాధి పొందుతున్నారన్నారు. యూపీఏ పాలనలో బ్యాంకింగ్ సెక్టార్ నాశనమైందని ఫైరయ్యారు..
న్యూఢిల్లీ: అధికారం కోసం యూపీఏ ప్రభుత్వం దురాశతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిందని ప్రధాని మోదీ శనివారం ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ఠ స్థితికి చేర్చిందని అన్నారు. శనివారం రోజ్‌గార్ మేళాలో మోదీ ప్రసంగిస్తూ.. గాంధీ కుటుంబంపై ఫైర్ అయ్యారు. ఒక కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు పొందారన్నారు. కానీ ఆ రుణాలు తిరిగి చెల్లించలేదని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచేలా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఫోన్ బ్యాంకింగ్’ స్కాం అతిపెద్ద కుంభకోణమన్నారు. ఫోన్ బ్యాంకింగ్ ఇప్పుడు సాధారణమైందని, కానీ తొమ్మిదేండ్ల క్రితం సాధారణ పౌరులకు అందుబాటులో లేదని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు బలమైన బ్యాంకింగ్ రంగం కలిగిన దేశాల్లో భారతదేశం కూడా ఉందని తెలిపారు.
70 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లు..
రోజ్ గార్ మేళాలో ప్రధాని మోదీ దాదాపు 70,000 మందికి పైగా నియామక పత్రాలను అందించారు. దేశంలో ప్రస్తుతం ఎక్కువ మంది బ్యాంకింగ్ రంగంలో ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, చిన్న బ్యాంకులను విలీనం చేయడం, వృత్తి నైపుణ్యాన్ని ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలను చేపట్టిందని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతకుముందు వేల కోట్ల రూపాయల నష్టాలకు, నిరర్థక ఆస్తులకు (ఎన్‌పీఏ) ప్రసిద్ధి చెందాయని, అయితే ఇప్పుడు అవి రికార్డుస్థాయి లాభాలకు పేరు పొందాయని ప్రధాని చెప్పారు. 'ముద్ర' పథకం కింద పేదలు, అసంఘటిత రంగాలకు రుణాల ద్వారా సహాయం చేయడం, మహిళా స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడానికి బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు.
బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్టంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు ఉందని, తొమ్మిదేండ్ల క్రితం ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు బ్యాంకు డిపాజిట్లకు కూడా బీమా చేసిందని, 99 శాతానికి పైగా ఖాతాదారుల భద్రతకు భరోసా కల్పించామని మోదీ చెప్పారు. బ్యాంకులను మోసగించిన వారిపై వారి ఆస్తుల అటాచ్‌మెంట్‌లతో సహా కఠినమైన చర్యలు కూడా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి రాబోయే 25 సంవత్సరాలు దేశానికి చాలా కీలకమని పేర్కొన్నారు.
