IND Vs NZ, 1st Test: జాగ్రత్తగా ఆడినా ఔట్: చేజేతులా వికెట్ పారేసుకున్న రోహిత్

బెంగళూరు టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఏదీ కలిసి రావడం లేదు. అతనికి ఈ మ్యాచ్ మొత్తం దురదృష్టం వెంటాడుతుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద పొరపాటు చేసిన రోహిత్.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ 2 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. ఫీల్డింగ్ లోనూ అసహనంగా కనిపించాడు. తాజాగా రెండో ఇన్నింగ్స్ లో అతను దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. బౌలింగ్ లోనూ విఫలమై ప్రత్యర్థికి 356 పరుగుల భారీ ఆధిక్యం ఇచ్చారు. ఈ దశలో రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ చాలా జాగ్రత్తగా ఆడాడు. ఆచితూచి ఆడుతూ మధ్యలో బౌండరీలు బాదాడు. హాఫ్ సెంచరీ చేసి మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే అజాజ్ పటేల్ బౌలింగ్ లో అతనికి అదృష్టం వెక్కిరించింది. బంతిని డిఫెన్స్ ఆడిన హిట్ మ్యాన్.. అది వికెట్ల వైపు వెళ్తున్న సంగతి కనిపెట్టలేకపోయాడు. 

ALSO READ | IND Vs NZ, 1st Test: సిక్సుల్లో సెహ్వాగ్, రోహిత్‌ను దాటేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

క్రీజ్ వద్ద బంతి ఒక స్టెప్ పడి వికెట్లను తగిలింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్న రోహిత్ షాకయ్యాడు. తలపై చేతులు పెట్టుకొని విచారంగా కాసేపు క్రీజ్ లోనే అలా ఉండిపోయాడు. కొంచెం షార్ప్ గా ఉన్నా రోహిత్ కాలితోనో, బ్యాట్ తోనే బంతి ఆపితే బతికిపోయేవాడు. కానీ పరాకుగా ఉండడంతో వికెట్ చేజార్చుకున్నాడు. రోహిత్ ఔటవ్వడంతో చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

కీలక సమయంలో హిట్ మ్యాన్ ఔట్ కావడంతో భారత్ 95 పరుగుల వద్ద 2 వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 63 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. రోహిత్ ఔటైనా భారత్ రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా ఆడుతుంది .  మూడో రోజు చివరి సెషన్ లో ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కోహ్లీ (48), సర్ఫరాజ్ (51) క్రీజ్ లో ఉన్నారు. భారత్ ఇంకా 168 పరుగులు వెనకపడి ఉంది.