T20 World Cup 2024: పంత్ తెలివితేటలతో ప్రపంచ కప్ గెలిచాం..: రోహిత్ శర్మ

ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విశ్వవిజేతగా అవతరించిన విషయం విదితమే. టోర్నీ అసాంతం అద్భుత ఆట తీరు కనబరిచిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. చేజారిపోయిందనుకున్న ట్రోఫీని రెండు చేతులా ఒడిసి పట్టుకుంది. 

30 బంతుల్లో 30 పరుగులు

దక్షిణాఫ్రికా విజయానికి చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో భారత పేస్ త్రయం బుమ్రా, హార్దిక్, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బుమ్రా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగా.. హార్దిక్ కీలక వికెట్లు పడగొట్టి సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచాడు. అయితే, వీరితో పాటు టీమిండియా విజయానికి మరో బలమైన కారణం ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. మ్యాచ్ పై ఆశలు చేజారుతున్న సమయంలో వికెట్ కీపర్/ బ్యాటర్ రిషబ్ పంత్ తెలివితేటలు తమకు అదృష్టాన్ని కొని తెచ్చాయని హిట్‌మ్యాన్ తెలిపాడు.

సమయం వృథా..!

క్లాసెన్, మిల్లర్ మ్యాచ్ ముగించేలా ఉన్న సమయంలో గాయం సాకుతో పంత్ సమయాన్ని వృథా చేయడమే తమకు కలిసొచ్చిందని రోహిత్ వెల్లడించాడు. ఆ నాలుగైదు నిమిషాలలో క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయాడు తెలిపాడు. 

ALSO READ : Irani Cup 2024: ఇరానీ కప్‌ విజేత ముంబై

"24 బంతుల్లో 26 పరుగులు చేయాలి.. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. మేము ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాం. క్లాసెన్, మిల్లర్ లలో ఏ వికెట్ తీయాలా అని ఆలోచిస్తున్నాం.. ఆ సమయంలోపంత్ తన తెలివితేటలను ఉపయోగించి మంచి విరామం ఇచ్చాడు. అతను తన మోకాలిపై కొంత ట్యాపింగ్ చేసాడు.  ఆటను నెమ్మదించాడు. ఆ సమయంలో బ్యాటర్ కి అలాంటివి నచ్చవు. త్వరగా బంతులేయాలని కోరుకుంటాడు. ఆ సమయాన్ని మేము బాగా సద్వినియోగ పరుచుకున్నాం. పోరాడే ధైర్యాన్ని నింపుకున్నాం. విజయానికి ఇది పూర్తిగా కారణం కావచ్చని నేను చెప్పడం లేదు.. కానీ ఖచ్చితంగా వాటిలో ఒకటి.." అని హిట్‌మ్యాన్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో వెల్లడించాడు.