IND vs BAN 2nd Test: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో.. రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌

కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లా మధ్య జరుగుతోన్న రెండో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. వర్షం కారణంగా మూడు రోజుల ఆట తుడిచి పెట్టుకుపోగా.. చివరి రెండు రోజుల్లో విజయం సాధించలేమా అన్నట్లు భారత ఆటగాళ్లు కనిపిస్తున్నారు. పదునైన పేస్, బౌన్స్‌తో బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ త్రయం భయపెడుతుంటే.. ఫీల్డింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. బౌండరీకి వెళ్లాల్సిన బంతిని ఒంటి చేత్తో ఒడిసి పట్టుకొని హిట్ మ్యాన్ ఔరా అనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో..

107/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 5 పరుగులు జత చేయగానే ముష్ఫికర్ రహీమ్(11) వికెట్ కోల్పోయింది. భారత ప్రధాన పేసర్ బుమ్రా.. ఓ చక్కని బంతితో  ముష్ఫికర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లిట్టన్ దాస్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. ఎంత సేపు నిలువరించినా భారత బౌలర్లను అడ్డుకోవడం సాధ్యం కాదని తెలిసి వచ్చిరాగానే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. బుమ్రా వేసిన 43వ ఓవర్‌లో ఏకంగా మూడు బౌండరీలు రాబట్టాడు. అదే దూకుడులో మరో ఫోర్ కోసం ప్రయత్నించగా.. అద్భుతమైన క్యాచ్‌తో హిట్ మ్యాన్ వెనక్కి పంపాడు.

సిరాజ్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతిని రోహిత్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. బంతి తన చేతిలో పడటంతో హిట్ మ్యాన్ సహా ప్రత్యర్థి బ్యాటర్, భారత జట్టు ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి హిట్ మ్యాన్ అలాంటి క్యాచ్‌లు అందుకోవడం చాలా అరుదు. దాంతో మైదానంలో కాసేపు నవ్వులు చిగురించాయి.

మమినుల్ ఒంటరి పోరాటం

లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఒక ఎండ్‌లో బ్యాటర్లు వీడుతున్నా.. మరో ఎండ్‌లో మమినుల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 176 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 102 పరుగులు చేశాడు. ప్రస్తుతం మమినుల్(102*), మెహిదీ హసన్(6*) క్రీజులో ఉన్నారు.