- సర్జరీల కోసం మన రోబో రెడీ
- హైటెక్ టెక్నాలజీతో రోబోటిక్ ఆపరేషన్
- దేశీయంగా తయారైన మంత్ర
- తయారు చేసిన ఎస్ఎస్ ఇన్నోవేషన్ కంపెనీ
- ధర రూ. 4 నుంచి 5 కోట్లు
- శరీరంపై గాట్లు తక్కువ..
- 2–3 రోజుల్లోనే రికవరీ
హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ లేదా ఆపరేషన్ చేస్తాడు. కానీ, రోబో వచ్చి ఆపరేషన్ చేయడం చూడలేదు. మన సొంత టెక్నాలజీతో తయారు చేసిన ‘మంత్ర’ అనే రోబో సర్జరీలు చేసేందుకు రెడీ అవుతున్నది. మంత్రను గుర్గావ్లోని ఎస్ఎస్ ఇన్నోవేషన్ కంపెనీ తయారు చేసింది. మంత్ర రోబోను కొయంబత్తూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఇన్స్టాల్ చేసినట్లు తెలిపింది. అయితే రోబోటిక్ సిస్టమ్ మాత్రం ఇప్పటికే దేశంలోని కొన్ని హాస్పిటల్స్‌లో ఇన్స్టాల్ చేసింది. వాటిలో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒకటి. ఈ కంపెనీ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ్‌కు చెందినది. ఈయన కార్డియో థొరాసిక్ సర్జన్. రోబోటిక్ సర్జరీలో స్పెషలిస్ట్. ఈ రోబోటిక్ సిస్టమ్ ద్వారా సామాన్య ప్రజలు హైటెక్ వైద్య సేవలు పొందడం సులభతరం అవుతుందని డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ తెలిపారు.
మన ఇండియన్ ‘మంత్ర’
‘మంత్ర’ రోబోలోని ప్రతీ పార్ట్ మన ఇండియాలోనే తయారు చేశారు. ఇదే ఈ రోబో స్పెషాలిటీ. రోబోటిక్ సిస్టమ్ మొత్తం ఇండియాదే.రోబోలో మొత్తం నాలుగు వర్కింగ్ ఆర్మ్స్ సెట్ చేశారు. స్టేట్ వర్కింగ్ ఆర్మ్‌లో కెమెరా ఫిట్ చేశారు. దీని ద్వారా తీసిన ఫొటోలు చూసేందుకు ఓ పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఉంటుంది.ఈ మొత్తం సిస్టమ్‌ను ఆపరేట్ చేయడానికి ఓ డాక్టర్ ఉంటాడు. ఆపరేటింగ్ సిస్టమ్‌లో హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. దీని ద్వారే మొత్తం రోబోను కంట్రోల్ చేయవచ్చు. ఈ సిస్టమ్‌లో మొత్తం మూడు భాగాలు ఉంటాయి. మొదటిది: సర్జన్ కమాండ్ సెంటర్. డాక్టర్ ఇక్కడి నుంచే మంత్రను అపరేట్ చేస్తాడు. రెండోది : పేషంట్ సైడ్ఆర్మ్ కార్ట్స్. ఈ భాగం పేషంట్‌కు సర్జరీ చేస్తుంది. ఇక మూడోది : విజన్ కార్ట్. డాక్టర్ మొత్తం ఇందులో సర్జరీ విధానాన్ని చూస్తూ ఉంటాడు.
ఎలాంటి సర్జరీలు చేస్తుంది.. స్పెషాలిటీ ఏంటి?
మంత్ర రోబోతో ఎన్నో రకాల సర్జీలు చేయొచ్చు. ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 25 రకాలు సర్జరీలు చేస్తున్నది. యూరాలజీ క్యాన్సర్, గైనకాలాజికల్ క్యాన్సర్, గ్యాస్ట్రో ఇన్స్టయినల్ క్యాన్సర్ చేస్తున్నది. దీంతో పాటు కార్డియో థొరాసిక్ సర్జరీ సేవలు కూడా అందిస్తున్నది. రోబోటిక్ సిస్టమ్ కాస్ట్ చాలా తక్కువ. ఒక యూనిట్ కాస్ట్ రూ.4 నుంచి 5 కోట్ల దాకా ఉంటుంది. దీంతో పోలిస్తే.. గ్లోబల్సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ కాస్ట్ రూ.15 నుంచి రూ.17 కోట్ల వరకు ఉంటుందని ఎస్ఎస్ ఇన్నొవేషన్ కంపెనీ చెబుతున్నది. మంత్ర రోబోతో మరో ప్రత్యేకత ఏంటంటే.. సర్జరీ టైంలో ఎక్కువ మొత్తంలో బాడీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో పేషంట్‌కు పెయిన్ తక్కువగా ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత పేషంట్ కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే రికవరీ అవుతాడు. నాన్ రోబోటిక్ సర్జరీల్లో అయితే నెల వరకు సమయం పడుతుంది.
