IND vs NZ: టీమిండియా ఓటముల వెనుక CSK..? రహస్యాన్ని బయటపెట్టిన ఊతప్ప

స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 3-0తో కోల్పోయిన విషయం తెలిసిందే. అందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(CSK) పరోక్షంగా కారణమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆరోపించారు. భారత పరిస్థితులకు అలవాటు పడేందుకు చెన్నై ఫ్రాంచైజీ.. ఒక విదేశీ ఆటగాడికి సాయం చేయడం వల్లే రోహిత్ సేనకు ఈ దుస్థితి వచ్చిందని భారత మాజీ అన్నారు.

అసలేం జరిగిందంటే..?

భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి 15 రోజుల ముందుగానే కివీస్ జట్టు భారత గడ్డపై కాలు మోపింది. వారు కాన్పూర్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ తలపడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఆ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర.. చెన్నై సూపర్ కింగ్స్(CSK) శిక్షణా శిబిరంలో శిక్షణ పొందాడు. దాంతో, అతనికి భారత ఉపఖండ పిచ్‌లపై పూర్తి అవగాహన వచ్చిందని ఊతప్ప అంటున్నారు. 

ఆ అవగాహనతోనే బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో రచిన్ క్రీజులో పాతుకుపోయాడని భారత మాజీ ఆరోపించారు. అందులో వాస్తవం లేకపోలేదు. తొలి ఇనింగ్స్‌లో భారత బ్యాటర్లు 46 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. రవీంద్ర ఇరు ఇన్నింగ్స్‌లలో కలిపి 173 (134, 39*) పరుగులు చేశాడు. దాంతో, కివీస్ జట్టు 36 ఏళ్ల తరువాత భారత గడ్డపై విజయం సాధిచింది.

"విదేశీ ఆటగాడైన రచిన్ రవీంద్ర ఇక్కడికి వచ్చి CSK అకాడమీలో ప్రాక్టీస్ చేశాడు. CSK అనేది ఒక అందమైన ఫ్రాంచైజీ. ఎల్లప్పుడూ తన ఆటగాళ్లను మంచిగా చూసుకుంటుంది. కానీ, ఏదేని ఫ్రాంచైజీకి ఆటగాళ్ల కంటే దేశం ముఖ్యం. ప్రత్యేకించి ఒక విదేశీ ఆటగాడి పట్ల అలాంటి వాటికి అనుమతిచ్చి ఉండకూడదు. ఆ సన్నద్ధత కారణంగానే రచిన్ రవీంద్ర అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ భారత గడ్డపై విదేశీ ఆటగాడి అత్యుత్తమ నాక్‌లలో ఒకటి. పేసీ వికెట్‌పై 157 బంతుల్లో 134 పరుగులు చేసి శభాష్ అనిపించాడు.." అని ఊతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

చెన్నై ఎందుకు సాయం చేసింది..?

రచిన్ రవీంద్ర.. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్. 2021, 2022 ఎడిషన్‌లలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ CSK జట్టులో కీలక ఆటగాడు. అందువల్లే, సీఎస్కే యాజమాన్యం అతన్ని ప్రాక్టీస్ కోసం అనుమతిచ్చింది. కాగా, ఈ రాబోవు ఎడిషన్‌ కోసం చెన్నై యాజమాన్యం అతన్ని అంటి పెట్టుకోలేదు. వేలంలోకి వదిలేసింది.