కత్రినా కైఫ్ పై  రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కత్రినా కైఫ్ పై  రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

రోడ్లను  బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బుగ్గలతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్‌ గుడా. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఝున్‌ఝును జిల్లాలోని తన నియోజకవర్గంలోని ఉడైపుర్వటి  ప్రాంతం ప్రజలతో సమావేశమైయ్యారు రాజేంద్ర సింగ్‌ గుడా.  ఆయనతో తమ సమస్యల్ని చెప్పుకున్నారు అక్కడి జనం. ఇందులో భాగంగా  తమ ప్రాంతంలో రహదారులను బాగుచేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడే ఉన్న పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌తో 'నా నియోజకవర్గంలో రోడ్లు  కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలని అన్నారు మంత్రి. దీంతో అక్కడి ప్రేక్షకుల్లో కొందరు చప్పట్లు కొట్టగా.. మరికొందరు  నవ్వుకున్నారు.

రాజకీయ నాయకులు రహదారులను సినీతారల బుగ్గలతో పోల్చడం ఇదేమీ మొదటి సారి కాదు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇవ్వడం అప్పట్లో వివాదానికి దారితీసింది. అదేవిధంగా మధ్యప్రదేశ్‌ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ కూడా 2019లో తమ రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లను సుందరంగా.. 'డ్రీమ్‌గర్ల్‌' స్టార్‌ బుగ్గల్లా మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. 2013లో యూపీలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారాం పాండే ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో రోడ్లను  సినీతారలు హేమమాలిని, మాధురీ దీక్షిత్‌ బుగ్గల్లా నిర్మిస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. అదే ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ  నేత, మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ కూడా తమ రాష్ట్ర రహదారులను హేమమాలిని బుగ్గలతో పోల్చడం రచ్చగా మారింది.