- నగరంలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానం
- దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లు
- పాట్ హోల్స్ కూడా పూడ్చని బల్దియా
- పనుల కోసం ఇష్టమున్నట్టు తవ్వి రిపేర్లు చేయని కాంట్రాక్టర్లు
- యాక్షన్తీసుకోని బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమై కనిపిస్తున్నాయి. అడుగుకో గుంత ఏర్పడడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. వర్షాలు పడ్డప్పుడు రోడ్లపై గుంతలు ఏర్పడడం సహజమే అయినా ఇప్పుడు వర్షాలు లేకున్నా అదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు పడ్డప్పుడు చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల అప్పటి నుంచి రోడ్లు వేయకపోవడం, కనీసం పాట్ హోల్స్ కూడా పూడ్చకపోవడంతో రోడ్ల దుస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఇంకోవైపు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన కాంట్రాక్టర్లు కరెంట్, వాటర్ వర్క్స్, డ్రైనేజీ, కేబుల్ పనుల కోసం రోడ్లను తవ్వి మళ్లీ వేయకపోవడంతో తిప్పలు తప్పడం లేదు.
వెయ్యి కిలోమీటర్ల మేర డ్యామేజ్
బల్దియా పరిధిలో 9013 కిలోమీటర్ల రోడ్లుండగా, 2846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నల్సీసీ రోడ్లున్నాయి. ఈ రోడ్లపై సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నా అధికారులు స్పందించడం లేదు. అడిగితే ‘రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు’ అని సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి ఇండియన్రోడ్కాంగ్రెస్ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేండ్ల వరకు, సీసీ రోడ్డయితే పదేండ్ల వరకు పటిష్టంగా ఉండాలి. కానీ, ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే దెబ్బతింటున్నాయి.
ఎమ్మెల్యేల ఫిర్యాదులు
తమ నియోజకవర్గాల్లో దెబ్బ తిన్న రోడ్లను రిపేర్చేయాలని, కొత్త రోడ్లు వేయాలని ఎమ్మెల్యేలు బల్దియా అధికారులను కోరుతున్నారు. తన నియోజకవర్గంలో లెక్కలెనన్ని పాట్ హోల్స్ ఉన్నాయని, అర్జెంట్‌గా పనులు చేయాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌కు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఈ నెల 11న వినతిపత్రం ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రోడ్ల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా స్పందన కనిపించడం లేదు.
ఎన్వోసీ లేకుండానే తవ్వకాలు
గ్రేటర్ రోడ్లను తవ్వాలన్నా, ఎలాంటి పనులు చేయాలన్నా ఎన్వోసీలు తీసుకోవాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత రోడ్లు వేసే బాధ్యత కాంట్రాక్టర్‌దే. ఒకవేళ కాంట్రాక్టర్ ఆ పని చేయకపోతే ఆ పని బిల్లులు ఆపే అధికారం ఆఫీసర్లకు ఉంటుంది. కానీ ఇలా ఎక్కడా జరగడం లేదు. కొన్ని చోట్లయితే అసలు పర్మిషన్అనేదే తీసుకోకుండా రాత్రికి రాత్రే తవ్వి పని చేసుకొని పోతున్నారు. దీంతో వెహికిల్స్మూవ్ మెంట్ స్లో అయి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్జామ్స్ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
సర్వీస్ఎక్కువగా ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో బల్దియా వైట్ట్యాపింగ్రోడ్లు వేసింది. ఈ రోడ్లు వేసే ముందు అక్కడ ఐదేండ్ల పాటు రోడ్లను తవ్వకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ రోడ్లను కూడా పనుల కోసం తవ్వేస్తున్నారు. కొన్ని పనుల విషయమైతే జీహెచ్ఎంసీ ఏఈలు, ఈఈలకు కూడా తెలియడం లేదు.
ఒక్కటా.. రెండా.. ఎన్నో చోట్ల..
మెయిన్‌రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను రోజూ ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో రోడ్లు తవ్వి రోజులు గడుస్తున్నా రిపేర్చేయడం లేదు. మెహిదీపట్నంలో మెయిన్‌రోడ్డుపై ఎలక్ర్టిసిటీ పనుల కోసం రోడ్డు తవ్వినా తిరిగి వేయలేదు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామవుతోంది. టోలిచౌకి ఫ్లైఓవర్ కింద పనులు చేసి నెలలు గడిచినా మళ్లీ పునరుద్ధరించలేదు.
ALSO READ : మెట్రో మలుపు..గుండెల్లో కుదుపు..పలు రూట్లలో క్రాసింగ్స్ వద్ద భరించలేని శబ్ధం
అంబర్ పేట్ ఫ్లైఓవర్ పనుల కారణంగా నాలుగేండ్లుగా ఇక్కడ రోడ్డు బ్లాక్ చేయడంతో 6 నెంబర్ వైపు వెళ్లే వాహనదారులు రెడ్ బిల్డింగ్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు కిలోమీటర్ మేర పూర్తిగా గుంతలమయమైంది. అలాగే, రేతిబౌలి మెయిన్‌రోడ్డుపై, టోలిచౌకి మెయిన్‌రోడ్డుపై కూడా గుంతలు ఏర్పడ్గాయి. దాదాపు అంతర్గత రోడ్లన్నీ ధ్వంసమై కనిపిస్తున్నాయి. షేక్ పేట్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై పూర్తిగా గుంతలు ఏర్పడ్డాయి. విజయ్ నగర్ కాలనీ, కూకట్ పల్లి, బాలానగర్, జీడిమెట్ల ఇలా అన్ని ప్రాంతాల్లో పాట్ హోల్స్ ఉన్నాయి.