వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో  నలుగురు మృతి

జహీరాబాద్, వెలుగు: కర్నాటక రాష్ట్రం గానాగాపూర్ లోని దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్  పట్టణ సమీపంలో హైవేపై డివైడర్ ను కారు ఢీకొనడంతో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్  సూరారంకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గానగాపూర్  దత్తాత్రేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. శనివారం తిరిగి హైదరాబాద్  వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బొమ్మిడి సురేశ్​కుమార్ అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలైన రాయపాటి నర్సింహారావును ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన లీలా మనుష్య, శివకుమార్ ను జహీరాబాద్  ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డికి తరలించారు. మృతులు హైదరాబాద్ లోని సూరారం శివాలయం కాలనీకి చెందినవారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టిన బైక్

చండ్రుగొండ: భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు చనిపోగా, తల్లి పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో పూజారిగా పని చేస్తున్న చిలుమూరి సతీశ్ కుమార్ శర్మ(50), కొడుకు హనీశ్ శర్మ(12), భార్య లక్ష్మీ హిమబిందుతో కలిసి కొత్త పల్సర్  బైక్ పై భద్రాచలం నుంచి తిరువూరు వైపు వెళ్తుండగా, తిప్పనపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్  ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు స్పాట్​లోనే చనిపోయారు. లక్ష్మీహిమబిందుకు గాయాలై స్పృహ తప్పి పడిపోవడంతో గ్రామస్తులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్ఐ స్వప్న పరిశీలించి, డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం తరలించారు.

రాజన్న దర్శనానికి వచ్చి గుండెపోటుతో డ్రైవర్..

వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనం కోసం భక్తులను తీసుకువచ్చిన ఓ డ్రైవర్  గుండెపోటుతో అదే వెహికల్​లో చనిపోయాడు. మహబూబాబాద్  జిల్లా కేసముద్రం నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి శుక్రవారం రాత్రి ఓ ఫ్యామిలీని సూరయ్య అనే డ్రైవర్  తీసుకువచ్చాడు. రాత్రి వారితో పాటు భోజనం చేశాడు. ఆలయ పార్కింగ్  ప్లేస్ లో వెహికల్​ పార్క్  చేసి వాహనంలో పడుకుంటానని చెప్పి వెళ్లాడు. శనివారం దర్శనం చేసుకున్న భక్తులు ఎంత ఫోన్  చేసినా డ్రైవర్  ఫోన్​ లిఫ్ట్  చేయకపోవడంతో వాహనాన్ని వెతుక్కుంటూ వచ్చిన భక్తులకు డ్రైవర్  చనిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించారు.