రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి

  •     సిద్దిపేట జిల్లా బెజ్జంకి వద్ద కల్వర్టును ఢీకొట్టిన కారు, తల్లీకూతురు మృతి
  •     వనపర్తి మండలంలో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ బోల్తా, ఇద్దరు కూలీలు..

బెజ్జంకి, వెలుగు : కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో తల్లీకూతురు చనిపోగా మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం జరిగింది. ఏఎస్సై శంకర్‌‌‌‌‌‌‌‌రావు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన వేముల వరలక్ష్మి (42), కూతురు అద్వితి (13), తమ్ముడు ఉదయ్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌తో కలిసి శనివారం కారులో కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నారు. బెజ్జంకి గ్రామ శివారులోకి రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో వరలక్ష్మి, అద్వితి అక్కడికక్కడే చనిపోగా ఉదయ్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఉదయ్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ను 108లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ మధు, సీఐ శీను ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వరలక్ష్మి భర్త మూడు నెలల కిందే జీవనోపాధి కోసం నైజీరియా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ బోల్తా పడి ఇద్దరు కూలీలు...

వనపర్తి, వెలుగు : ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ బోల్తాపడి ఇద్దరు కూలీలు చనిపోయారు. ఈ ప్రమాదం వనపర్తి మండలం సవాయిగూడెంలో శనివారం జరిగింది. సవాయిగూడెం గ్రామానికి చెందిన 20 మంది కూలీలు శనివారం ఓ రైతు వేరుశనగ పంటలో కలుపు తీసేందుకు వెళ్లారు. పని ముగిసిన తర్వాత ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌లో తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని చెరువు ముందరి తండా సమీపంలో చెరువు కట్ట మీదకు రాగానే ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న గోపాలమ్మ (58), పద్మమ్మ (59) అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. మహిళల మృతితో గ్రామంలో విషాదచాయలు అమలుకున్నాయి.