మూడు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

  • కామారెడ్డి జిల్లాలో బైక్‌‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ఇద్దరు యువకులు మృతి
  • మేడ్చల్‌‌ జిల్లాలో యువకుడు.. 
  • మెదక్‌‌ జిల్లాలో హార్వెస్ట్‌‌ను ఢీకొట్టిన బైక్‌‌, ఇద్దరు మృతి

పిట్లం, వెలుగు : బైక్‌‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు స్పాట్‌‌లోనే చనిపోయారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా జుక్కల్‌‌ మండలం కౌలాస్‌‌గేట్‌‌ సమీపంలో 161 హైవేపై గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద కొడప్‌‌గల్‌‌ మండలం తక్కడపల్లికి చెందిన మేకల్‌‌వార్‌‌ కార్తీక్‌‌ (27), మేకల్‌‌వార్‌‌ వంశీ (24)  అన్నదమ్ముల పిల్లలు. 

వీరిద్దరు కలిసి గురువారం బైక్‌‌పై పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో జుక్కల్‌‌ గేట్‌‌ సమీపంలోకి రాగానే వీరి బైక్‌‌ను వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కార్తీక్‌‌, వంశీ అక్కడికక్కడే చనిపోయారు. కార్తీక్‌‌కు ఆరు నెలల కిందే పెండ్లి అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. 

డీసీఎం ఢీకొని యువకుడు..

మేడ్చల్‌‌, వెలుగు : బైక్‌‌ను డీసీఎం ఢీకొట్టడంతో ఓ యువకుడు చనిపోయాడు. ఘటన మేడ్చల్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్‌‌ మండలం రావల్‌‌కోల్‌‌ గ్రామానికి చెందిన కాకిపల్లి నాగరాజు (34) రాజబొల్లారం గ్రామంలోని మోనార్క్‌‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం బైక్‌‌పై కంపెనీకి వెళ్తుండగా పూడూరు చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాగరాజుకు సంవత్సరం క్రితమే పెండ్లి కాగా భార్య ప్రస్తుతం నిండు గర్భిణి కాగా మరో నెలరోజుల్లో నాగరాజు చెల్లెలు పెండ్లి జరగనుంది. ఇంతలోనే అతడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఆగిఉన్న హార్వెస్టర్‌‌ను ఢీకొని..

మెదక్, వెలుగు : ఆగి ఉన్న హార్వెస్టర్‌‌ను బైక్‌‌ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం మెదక్‌‌ మండలం మాంబోజిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది. పేరూరు గ్రామానికి చెందిన గుండ్ల సాయిలు (47), తిప్పపురం వంశీ (25) బైక్‌‌పై మంబోజిపల్లి వైపు నుంచి పేరూరుకు వెళ్తున్నారు. మాంబోజిపల్లి శివారులోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న హార్వెస్టర్‌‌ను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ సాయిలు, వంశీ స్పాట్‌‌లోనే చనిపోయారు.