మేడ్చల్ చెక్ పోస్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. టీవీఎస్ బైక్ను ఢీ కొట్టి మీద నుంచి వెళ్లిన లారీ..

హైదరాబాద్: యాక్సిడెంట్ అంటే ఒక బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు. ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీ చెప్పే డైలాగ్ ఇది. ఇది కేవలం సినిమాలో ఒక డైలాగ్ మాత్రమే కాదు వాస్తవం కూడా. యాక్సిడెంట్ జరిగితే ఒక కుటుంబం మొత్తం నడిరోడ్డు పడుతుంది. అలాంటిది.. కుటుంబంలో నలుగురు ఉంటే ఆ నలుగురిలో ముగ్గురు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి ఊహించుకుంటేనే దు:ఖం తన్నుకొస్తుంది. మేడ్చల్ జిల్లాలో ఇదే ఘటన జరిగింది. ఒక లారీ ఆ కుటుంబాన్ని మృత్యువులా కబళించింది. టీవీఎస్ బైక్పై వెళుతున్న భార్యాభర్తలను లారీ పొట్టనపెట్టుకుంది. కొడుకు, కూతురులో.. పాప కూడా చనిపోయింది. కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

మేడ్చల్ చెక్ పోస్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం ఇది. టీవీఎస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. టీవీఎస్ పై ప్రయాణిస్తున్న భార్య, భర్త, కూతురు, కొడుకుతో మేడ్చల్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురి పై నుంచి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో భార్యాభర్తతో పాటు కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొడుకు కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో రెండు కాళ్ళు విరిగిపోయాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీని అక్కడ వదిలేసి భయంత పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మధ్యాహ్నం వరకూ సంతోషంగా గడిపిన ఈ కుటుంబం సాయంత్రానికి ఇంతటి ఘోర పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం శోచనీయం. కొన్నికొన్ని సందర్భాల్లో మనం ఎంత జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. ఈ దుర్ఘటనలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యం మూడు  నిండు ప్రాణాలను బలి తీసుకుందని ప్రమాద సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పోలీసులు ఆ దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అసలు ఈ ప్రమాదంలో తప్పు ఎవరిదో తేల్చే పనిలో ఉన్నారు.

అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే..

* మేడ్చల్ చెక్ పోస్టులో ఘోర రోడ్డు ప్రమాదం కూతురితో సహా భార్యాభర్తలు మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు
* కాకినాడకు చెందిన సాగి బుల్లబ్బాయి నగరంలోని ఉప్పల్లో నివాసముంటూ ఉదయం పూట టిఫిన్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు
 * ఈ రోజు మధ్యాహ్నం(05.01.2025) మేడ్చల్ ఎల్లంపేటలో ఉంటున్న వారి బంధువులను పరామర్శించేదుకు ఉప్పల్ నుంచి వెళుతున్న ఫ్యామిలీ
* ద్విచక్ర వాహనాంపై భార్యాభర్త, ఇద్దరు పిల్లలు మేడ్చల్ వెళుతుండగా చెక్ పోస్ట్ వద్ద అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ వస్తున్న నాగాలాండ్కు చెందిన కంటైనర్  లారీ 
* వెనుక నుంచి ఢీ కొట్టడంతో కూతురు.. భార్యాభర్తలు స్పాట్లోనే మృతి
* పిల్లాడి కాలిపై నుంచి లారీ దూసుకెళ్లగా బాబు రెండు కాళ్లు విరిగిపోయాయి. నొప్పికి విలవిలలాడిపోతూ ఏడుస్తున్న పిల్లాడిని‌ ఆసుపత్రికి తరలించారు
* మృతులు సాగి బుల్లబ్బాయి ( 37), సాగి లావణ్య ( 32), సాగి హర్షిత దేవి (8 ). సాగి సిద్ధేశ్వర్ (6 ) అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు
* లారీని అక్కడే వదిలేసి  పరారైన డ్రైవర్.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు