ముంబై: ఇండియాలో బంగారానికున్న డిమాండ్ తెలిసిందే. దీనికి తోడు అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, బంగారం ధర ఈ ఏడాది విపరీతంగా పెరగడానికి కారణమయ్యాయి. ఇండియాలో 10 గ్రాముల బంగారం రూ. 40,000 స్థాయిని తాకింది. బంగారం ధరలు 2020 లో కూడా గరిష్టాలకు చేరుకుంటాయని, రూ. 45,000 స్థాయిని తాకుతాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా రికవరి కాకపోవడం, అంతర్జాతీయంగా రాజకీయ ఆందోళనలు, రూపాయి కదలికలో అనిశ్చితి వంటి అంశాల వలన బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతారని అంచనావేస్తున్నారు. ప్రభుత్వ పాలసీల వలన ఈ ఏడాది మార్కెట్లు గరిష్టాలకు చేరుకోగలిగాయి. స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో పాటు, డిమాండ్ తగ్గడంతో 2019 సెకెండ్ హాఫ్‌లో గోల్డ్ ధర గణనీయంగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం ఈ ఏడాది మొత్తంగా 14 సెంట్రల్ బ్యాంకులు ఒక టన్ను కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇందులో రిజర్వ్ బ్యాంక్ కూడా ఉంది.
క్యూ3 లో తగ్గిన డిమాండ్..క్యూ4 లో పుంజుకుంటుంది
ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని కమోట్రెండ్జ్, రీసెర్చ్ డైరక్టర్ జ్ఞాన శేఖర్ త్యాగరాజన్ అన్నారు. గ్లోబల్‌గా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయని, దీంతో స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయన్నారు. మార్కెట్లు కరక్షన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, అందువలన బంగారం వంటి అసెట్స్ వాల్యు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా–చైనా ట్రేడ్‌వార్, మిడిల్‌ఈస్ట్‌లో రాజకీయ అనిశ్చితి వంటి అంశాలతో పాటు, 2020లో జరగనున్న అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. బంగారం(10 గ్రా.) టార్గెట్ మీడియం టెర్మ్‌లో ఎంసీఎక్స్‌లో రూ. 41,000–41,500 మధ్య ఉందని, ఇది రూ. 44,500–45,000 స్థాయికి చేరుకుంటుందని త్యాగరాజన్ తెలిపారు. ఇండియాలో బంగారం డిమాండ్ క్యూ3 లో తన మొమెంటం కోల్పోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ(ఇండియా) సోమసుందరమ్ పీ ఆర్ అన్నారు. కానీ పెళ్లిళ్లు, పండుగ సీజన్ ఉండడంతో క్యూ4లో బంగారం డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇండియన్ కరెన్సీతో పాటు ఇతర ప్రధాన కరెన్సీలు కూడా తమ జీవిత కాల గరిష్టాన్ని అధిగమించాయి. ఒక విధంంగా ఇది దేశీయ మార్కెట్‌లో గోల్డ్ డిమాండ్ పడిపోవడానికి కారణమైందని సోమసుందరమ్ అన్నారు. కానీ అమెరికా, యూరప్, ఇతర దేశాల ప్రధాన బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయని, దీంతో గోల్డ్ ఈటీఎఫ్ డిమాండ్ ఈ ఏడాది బాగానే ఉందని తెలిపారు. ఈ ఏడాది ఆర్‌బీఐ 60 టన్నులను కొనుగోలు చేసిందన్నారు. ఇండియాతో పాటు చైనా, రష్యా, టర్కి, పోలెండ్, కజకిస్థాన్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు టాప్ కొనుగోలుదారులుగా ఉన్నాయి.
డిమాండ్ గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువ..
ఈ ఏడాది ఫస్ట్‌హాఫ్‌లో గోల్డ్(10 గ్రా.) ధర రూ. 31,500–32,000 స్థాయిలో ఉండేది. కానీ రూపాయి తగ్గడం, బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడంతో ఇండియాలో గోల్డ్ రేట్ మరింత పెరిగింది. సెకెండ్ హాఫ్‌కు వచ్చే నాటికి బంగారం ధరలు విపరీతంగా పెరిగి రూ. 40,000 స్థాయిని తాకాయి. ధరలు విపరీతంగా పెరగడంతో సహజంగానే బంగారం డిమాండ్ పడిపోయింది. ఈ ఏడాది గోల్డ్ డిమాండ్ బాగా పెరగ లేదని, అలాగని బాగా తగ్గిపోలేదని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువలరీ డొమస్టిక్ కౌన్సిల్(జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు. డిమాండ్ పరంగా ఫస్ట్ హాఫ్ బాగుందన్నారు. కానీ కస్టమ్స్ డ్యూటీ పెరగడం, జీఎస్‌టీ వలన బంగారు ఆభరణాలు ఖరీదయ్యాయన్నారు. దీంతో డిమాండ్ పడిపోయిందని తెలిపారు. సరియైన సమయంలో వర్షాలు పడకపోవడంతో భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించిందన్నారు. దేశీయంగా 70 శాతం వరకు బంగారం డిమాండ్ గ్రామీణ ప్రాంతాలలోనే ఉందన్నారు. వచ్చే రెండుమూడేళ్లలో గోల్డ్ ధరలు కొత్త గరిష్టాలకు చేరుకుంటాయని ఇండియా బులియన్ అండ్ జ్యువలరీ అసోషియేషన్(ఐబీజేఏ) అధ్యక్షుడు పృథ్వి రాజ్ కొఠారి అన్నారు. ఇండియాలో లిక్విడిటీ సంక్షోభం, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం, డాలర్ మారకంలో రూపాయి బలహీనత వంటి అంశాలు బంగారం మార్కెట్‌కు మద్ధతుగా ఉన్నాయన్నారు. 2020లో బంగారం ధర మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. బంగారం రూ. 38,000 – 42, 000 పరిధిలో కదులుతుందని అంచనావేశారు. షార్ట్ టెర్మ్‌లో ఎంసీఎక్స్‌లో బంగారానికి రూ. 37,100–36,900 వద్ద బలమైన మద్ధతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమాని అన్నారు. ఎగువన రూ. 39,900, రూ. 41,500 వరకు కదులుతుందని అంచనావేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ‘మేండేటరీ హాల్‌మార్కింగ్’ పాలసీ వలన గోల్డ్ మార్కెట్ మరింత ఆర్గనైజ్డ్‌గా మారుతుందని సోమసుందరమ్ అన్నారు.
