రిషబ్ పంత్‌‌ పటాకా‌ 27కోట్లు..ఐపీఎల్‌‌ వేలంలో ఆల్‌‌టైమ్ రికార్డ్‌‌ ధర

  • లక్నో సూపర్ జెయింట్స్‌‌ ఫ్రాంచైజీలోకి రిషబ్‌
  • రూ. 26.75 కోట్లతో పంజాబ్‌‌ జట్టులోకి శ్రేయస్ అయ్యర్‌‌‌‌
  • కేకేఆర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ వెంకటేశ్‌‌ అయ్యర్‌‌‌‌కు రూ. 23.75 కోట్లు
  • తొలి రోజు వేలంలో  20 మందికి రూ. 10 కోట్లపైనే

జెడ్డా (సౌదీ అరేబియా) : టీమిండియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ రిషబ్ పంత్ ఊహించినట్టుగానే  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌ (ఐపీఎల్‌‌) వేలంలో చరిత్ర సృష్టించాడు. 2008 నుంచి జరుగుతున్న ఈ మెగా లీగ్‌‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ తరం ఆటగాళ్లలో డ్యాషింగ్‌‌ బ్యాటర్‌‌‌‌, కీపర్‌‌‌‌గానే కాకుండా  కెప్టెన్‌‌గానూ నిరూపించుకున్న రిషబ్ పంత్‌‌ లక్నో సూపర్ జెయింట్స్‌‌ నుంచి రూ. 27 కోట్ల మొత్తం అందుకొని ఔరా అనిపించాడు. ఆదివారం మొదలైన  2025 మెగా వేలంలో స్టార్ క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించింది. లీగ్‌‌లో ఆల్‌‌టైమ్‌‌ అత్యధిక  రేటు రికార్డు రెండుసార్లు బద్దలైంది.   

ముందుగా డిఫెండింగ్ చాంపియన్‌‌ కేకేఆర్‌‌‌‌ కెప్టెన్‌‌ శ్రేయస్ అయ్యర్‌‌ను పంజాబ్‌‌ కింగ్స్‌‌ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంతో గతేడాది అత్యధిక‌‌ ధర పలికిన మిచెల్ స్టార్క్ (కేకేఆర్‌‌‌‌, రూ. 24.75 కోట్లు) హయ్యెస్ట్ రేటు రికార్డు బ్రేక్ అయింది. కొద్దిసేపటికే పంత్‌‌ కోసం లక్నో మరో పాతిక లక్షలు ఎక్కువ చెల్లించింది. దాంతో ఆల్‌‌టైమ్‌ హయ్యెస్ట్‌‌ బిడ్ ప్లేయర్‌‌‌‌గా పంత్‌‌ నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్‌‌ కేకేఆర్‌‌‌‌ రిలీజ్‌‌ చేసిన ఆల్‌‌రౌండర్‌‌‌‌ వెంకటేశ్ అయ్యర్‌‌ జాక్‌‌పాట్ కొట్టాడు. 

వెంకీని  తిరిగి తమ  జట్టులోకి తీసుకోవడం కోసం ఆర్‌‌‌‌సీబీతో పోటీ పడ్డ కేకేఆర్ ఏకంగా రూ. 23.75 కోట్లు కుమ్మరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి రోజు వేలంలో 72 మంది ప్లేయర్లు అమ్ముడవ్వగా.. పంజాబ్‌ అత్యధికంగా పది మందిని తీసుకుంది. ముంబై నలుగురితోనే సరిపెట్టింది. మిగతా ప్లేయర్లు సోమవారం తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు.

పంత్‌‌ కోసం లక్నో పంతం

తొలి సెట్‌లో రిషబ్ పంత్ పేరు రాగానే హాల్‌‌లో కోలాహలం మొదలైంది. కీపర్‌‌‌‌–బ్యాటర్‌‌‌‌ కమ్ కెప్టెన్‌‌ ఆప్షన్‌‌ కావడంతో సహజంగానే  భారీ డిమాండ్ ఏర్పడింది. అతని కోసం మొదట లక్నో, ఆర్‌‌‌‌సీబీ పోటాపోటీగా బిడ్స్‌‌ వేస్తూ పది కోట్ల వరకూ వెళ్లాయి. రేటు 11 కోట్లకు చేరుకున్నాక ఆర్‌‌‌‌సీబీ డ్రాప్ అయింది. కానీ, రూ. 11.50 కోట్లతో సన్‌‌ రైజర్స్‌‌ రేసులోకి వచ్చింది. అయినా లక్నో ఏమాత్రం వెనక్కుతగ్గకపోవడంతో రేటు 20 కోట్ల మార్కు దాటింది.  

ఈ దశలో సన్‌‌ రైజర్స్ తప్పుకోగా..  లక్నో రూ. 20.75 కోట్ల బిడ్‌‌ వేసింది. అదే రేటుకు ఆర్‌‌‌‌టీఎం (రైట్ టు మ్యాచ్‌‌) ఆప్షన్‌తో పంత్‌‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపింది. దాంతో, అత్యధిక బిడ్‌‌ ఎంతో చెప్పాలని ఆక్షనీర్‌‌‌‌ అడగ్గా... లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా బిడ్‌‌ను ఒక్కసారిగా  రూ. 27 కోట్లకు పెంచారు. ఢిల్లీ ఆర్‌‌‌‌టీఎంను విత్‌‌డ్రా చేసుకోవడంతో రిషబ్ పంత్ లక్నో సొంతం అయ్యాడు.  

వార్నర్, పడిక్కల్ అన్‌‌సోల్డ్‌‌

ఆస్ట్రేలియా డేరింగ్‌‌ బ్యాటర్‌‌‌‌, గతంలో ఐపీఎల్‌‌లో మంచి రికార్డున్న డేవిడ్ వార్నర్‌‌‌‌పై తొలి రోజు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. అతనితో పాటు ఇంగ్లండ్ బ్యాటర్‌‌‌‌ జానీ బెయిర్‌‌‌‌స్టో, ఇండియన్‌‌ దేవదత్‌‌ పడిక్కల్‌‌ అన్‌‌సోల్డ్‌‌గా మిగిలారు. 

లక్కీ వెంకీ!

కొన్నేండ్లుగా తమ టీమ్‌‌లో కీలక ఆటగాడిగా ఉన్న వెంకటేశ్‌‌ అయ్యర్‌‌‌‌ను వేలంలోకి వదిలేసిన కేకేఆర్‌‌‌‌ అతడిని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు భారీ మొత్తం వెచ్చించింది. రూ. 2 కోట్ల బేస్‌‌ప్రైస్‌‌తో వచ్చిన వెంకీ కోసం ఆరు కోట్ల వరకూ కేకేఆర్‌‌‌‌, లక్నో పోటీపడ్డాయి. తర్వాత ఆర్‌‌‌‌సీబీ రేసులోకి రావడంతో అతని రేటు పెరుగెతూ వెళ్లింది. 20 కోట్లు దాటినా ఆర్‌‌‌‌సీబీ పోటీలోనే ఉండగా.. చివరకు ఐపీఎల్‌‌  చరిత్రలో నాలుగో అత్యధిక ధర (రూ. 23.75 కోట్లు)తో కేకేఆర్‌‌‌‌ అతడిని తిరిగి సొంతం చేసుకుంది. 

శ్రేయస్‌‌ను వదలని పంజాబ్‌‌..

ఇద్దరు అన్‌‌క్యాప్డ్‌‌ ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని రూ. 110 కోట్ల  భారీ మొత్తంతో వేలంలోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్ల జాబితాలో మొదటగా వేలంలోకి వచ్చిన స్టార్ పేసర్‌‌‌‌ అర్ష్‌‌దీప్ సింగ్‌‌ను ఆర్‌‌‌‌టీఎం ఉపయోగించి రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.  కెప్టెన్‌‌గా పనికొచ్చే శ్రేయస్ అయ్యర్ కోసం ముందు పంజాబ్ నుంచే ఆసక్తి చూపగా.. తొలుత  కేకేఆర్ కూడా పోటీ పడింది. 7.25 కోట్ల వద్ద ఢిల్లీ రేసులోకి వచ్చింది. ఇక్కడి నుంచి రెండు ఫ్రాంచైజీల మధ్య పోటాపోటీ నడవగా.. చివరకు ఢిల్లీనే వెనక్కుతగ్గింది. 

ఇండియా స్పిన్నర్‌‌‌‌ యుజ్వేంద్ర చహల్‌‌ (రూ. 18 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ. 11 కోట్లు)ను  కూడా భారీ రేటుతో జట్టులోకి తీసుకుంది. లక్నోకు కెప్టెన్‌‌గా వ్యవహరించిన కేఎల్‌‌ రాహుల్‌‌కు పెద్దగా డిమాండ్ లేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు అతడిని జట్టులోకి తీసుకుంది. 

సిరాజ్‌కు రూ. 12.25 కోట్లు..హైదరాబాద్‌ జట్టులోకి షమీ

తొలి రోజు వేలంలో ఇండియా, ఫారిన్ పేసర్లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఆర్‌‌‌‌సీబీ వదులుకున్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌‌ను గుజరాత్‌‌ రూ. 12.25 కోట్ల మొత్తంతో తమ జట్టులోకి తీసుకుంది. గాయం నుంచి కోలుకొని ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన ఇండియా పేసర్ మహమ్మద్ షమీని సన్‌‌రైజర్స్ హైదరాబాద్ రూ.10 కోట్లకు  కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన సౌతాఫ్రికా స్పీడ్‌‌స్టర్ కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకోగా.. గతేడాది రికార్డు రేటు పలికిన   ఆస్ట్రేలియా వెటరన్ మిచెల్  స్టార్క్ ఈసారి రూ. 11.75 కోట్లకే  ఢిల్లీ క్యాపిటల్స్‌‌ టీమ్‌‌లోకి వచ్చాడు.

జోష్ హేజిల్‌‌వుడ్ (రూ. 12.5 కోట్లు, ఆర్‌‌‌‌సీబీ), ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.5 కోట్లు, ముంబై ) ప్రసిధ్‌‌ కృష్ణ (రూ. 9.5 కోట్లు, గుజరాత్), అవేష్ ఖాన్ (రూ. 9.75 కోట్లు, లక్నో), కూడా మంచి రేటు పలికారు. ఇండియా వెటరన్ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌కు అనూహ్య డిమాండ్ ఏర్పడగా.. సీఎస్కే రూ. 9.75 కోట్లతో తిరిగి జట్టులోకి తీసుకుంది. డెవాన్ కాన్వే (రూ. 6.25 కోట్లు),  రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు)ను కూడా సీఎస్కే తిరిగి సొంతం చేసుకుంది. 

అఫ్గాన్‌ యంగ్ స్పిన్నర్‌‌ కోసం ఆ టీమ్ రూ. 10 కోట్లు  వెచ్చించింది.  మరోవైపు  ఇంగ్లండ్ బ్యాటర్ బట్లర్ రూ.15.75 కోట్లకు గుజరాత్ గూటికి చేరాడు.  ఆసీస్‌‌ యంగ్‌‌ బ్యాటర్ మెక్‌‌గర్క్‌‌ (రూ. 9కోట్ల) ఆర్‌‌‌‌టీఎం ఆప్షన్‌‌తో తిరిగి ఢిల్లీ జట్టులోకి వచ్చాడు.