Vijay Hazare Trophy: భువనేశ్వర్‌కు షాక్.. కెప్టెన్‌గా రింకూ సింగ్

భారత దేశవాళీ క్రికెట్ లో వన్డే ఫార్మాట్ లో జరిగే విజయ్ హజారే ట్రోఫీ శనివారం (డిసెంబర్ 21) నుంచి ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు ఆడే ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా రింకు సింగ్ ఎంపికయ్యాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్ కు నాయకత్వం వహించిన భువనేశ్వర్ కుమార్ నుండి అతను బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ మెగా టోర్నీలో ఉత్తర ప్రదేశ్  క్వార్టర్ ఫైనల్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయారు. 

సీనియర్ స్థాయిలో రాష్ట్ర జట్టుకు రింకూ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఈ సంవత్సరం ప్రారంభంలో అతను ఉత్తరప్రదేశ్ టీ 20 లీగ్ లో మీరట్ మావెరిక్స్‌ జట్టుకు కెప్టెన్ గా చేసి జట్టుకు టైటిల్ అందించాడు. ఈ లీగ్ లో రింకూ ఫినిషర్‌గా 161.54 స్ట్రైక్ రేట్‌తో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 210 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. యూపి టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్‌కు నాయకత్వం వహించడం నాకు గొప్ప అవకాశం. నేను జట్టును బాగా నడిపించినందుకు సంతోషంగా ఉంది" అని రింకు తమ విజయ్ హజారే ట్రోఫీ ఓపెనర్‌కు ముందు చెప్పారు. 

కెప్టెన్సీని చాలా ఆస్వాదించానని.. ఈ క్రమంలో చాలా విషయాలు నేర్చుకోగలిగానని రింకూ తెలిపాడు. ఒకవేళ రింకు సింగ్ విజయ్ హజారే ట్రోఫీలో జట్టును సమర్ధవంతంగా నడిపిస్తే ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేకేఆర్ జట్టును కెప్టెన్ లేడు. దీంతో పాటు 2025 లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి రింకూని సెలక్ట్ చేయాలంటే ఈ టోర్నీ చాలా కీలకం. రింకూ లిస్ట్ ఏ క్రికెట్ లో 52 ఇన్నింగ్స్‌లలో 48.69 సగటుతో 1899 పరుగులు చేశాడు. ఒక సెంచరీ.. 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.