59 రోజుల్లోనే రెట్టింపైన షేర్లు
రెండింతలకు పైగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోనే తొలి 150 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. శుక్రవారం సెషన్‌లో పెరిగిన షేరు ధరతో, కంపెనీ ఈ రికార్డును సాధించింది. రూపాయి టర్మ్స్ లో కంపెనీ వాల్యు రూ.11 లక్షల కోట్లకు పైగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుడ్ ఎనర్జీ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాప్ ఎస్ఏ, రాయల్ డచ్ షెల్, బీపీ కంటే ఎక్కువగా ఉండగా.. ఎక్సోన్ మొబిల్, చోవ్రోన్, సౌదీ ఆరామ్‌కో కంటే తక్కువగా ఉంది. దేశంలో స్టాక్ మార్కెట్లు రికవరీ అవుతోన్న క్రమంలో.. రిలయన్స్ తన ఇన్వెస్టర్లకు డబుల్ మనీని అందించింది. కేవలం 59 సెషన్స్‌లోనే ఇన్వెస్టర్ల మనీ డబుల్ అయింది. కంపెనీ షేర్లు శుక్రవారం ఆల్‌టైమ్ హైలో రూ.1,788.60 వద్ద ట్రేడయ్యాయి. ఆ తర్వాత 6.48 శాతం లాభంతో రూ.1,763.20 వద్ద క్లోజయ్యాయి. మార్చి 23న కరోనా లాక్‌డౌన్ ప్యానిక్‌తో రూ.867.82కు పడిపోయిన షేరు ధర, రెండింతలు మేర పెరగడం విశేషం. కంపెనీ ప్రస్తుతం డెట్ ఫ్రీ సంస్థగా అవతరించిందని ప్రకటన చేయడంతో, షేర్లు పరుగులు పెట్టాయి. కంపెనీ ఈ రెండు నెలల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1.69 లక్షల కోట్ల మనీని సేకరించింది. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో వాటాలను గ్లోబల్ టెక్ ఇన్వెస్టర్లకు అమ్మకం ద్వారా రిలయన్స్ రూ.1.15 లక్షల కోట్లను సమీకరించింది. మిగిలిన రూ.53,124.20 కోట్లను రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా పొందింది. రిలయన్స్ రైట్స్ ఇష్యూకి కూడా అనూహ్య స్పందన వచ్చింది. యూకే కంపెనీ బీపీ పీఎల్‌సీకి ఫ్యూయల్ రిటైలింగ్ వెంచర్‌లో 49 శాతం వాటాను అమ్మడాన్ని కూడా తీసుకుంటే.. మొత్తంగా రిలయన్స్ చేసిన ఫండ్ రైజింగ్ రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్ నికర అప్పు రూ.1,61,035 కోట్లుగా ఉంది. ఈ పెట్టుబడులను చూసుకుంటే, రిలయన్స్ ప్రస్తుతం నెట్ డెట్ ఫ్రీగా కంపెనీగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది.
డిజిటల్, రిటైల్ వ్యాపారాల్లో మస్తు గ్రోత్…
రిలయన్స్ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్, టెలికాం, రిటైల్ వ్యాపారాల్లో డామినెట్ పొజిషన్‌లో ఉంది. కంపెనీకి డిజిటల్, రిటైల్ బిజినెస్‌లు కీలక గ్రోత్ డ్రైవర్లుగా ఉన్నట్టు ఏంజెల్ బ్రోకింగ్ డీవీపీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ జ్యోతి రాయ్ తెలిపారు. రిలయన్స్ జియోను కంపెనీ విదేశాల్లో లిస్ట్ చేయాలనుకుంటోంది. దీనితోపాటు రిటైల్ వ్యాపారాలను వచ్చే కొన్నేళ్లలో లిస్ట్ చేయాలని ప్రతిపాదిస్తోంది.
‘మేము చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చాం. మా షేర్‌హోల్డర్స్, ఇతర స్టేక్‌హోల్డర్స్ అంచనాలను మించిపోయాం. షేర్‌హోల్డర్స్‌కి ఇచ్చిన ప్రామిస్ మేరకు రిలయన్స్‌ను 2021 మార్చి 31 కంటే ముందే డెట్ ఫ్రీ కంపెనీగా మార్చాం. ఈ గోల్డెన్ డికేడ్‌లో రిలయన్స్ మరిన్ని గ్రోత్ గోల్స్ పెట్టుకుని, వాటిని సాధిస్తుందని హామీ ఇస్తున్నాం. జియోతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఎంతో ఆసక్తిని చూపించింది. పైనాన్షియల్ ఇన్వెస్టర్ల నుంచి మా ఫండ్ రైజింగ్ మైలురాయిని సాధించాం. మా ఫైనాన్షియల్ పార్టనర్లకు థ్యాంక్స్ చెబుతున్నా. వారిని జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. మేము ఆఫర్ చేసిన రైట్స్ ఇష్యూ రికార్డు స్థాయిలో సక్సెస్ అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’. – ముకేశ్ అంబానీ, ఛైర్మన్, రిలయన్స్

