తుంగతుర్తి కాంగ్రెస్‌‌‌‌లో వర్గపోరు

  • పర్మిషన్‌‌‌‌ లేదంటూ అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు
  • పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ ఎదుట ధర్నాకు దిగిన కాంగ్రెస్‌‌‌‌ నాయకులు
  • దసరా తర్వాత గాంధీభవన్‌‌‌‌లోనే తేల్చుకుంటామన్న లీడర్లు

సూర్యాపేట, వెలుగు: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌లో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే మందుల సామేల్‌‌‌‌కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఒక్కటవుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా శనివారం అర్వపల్లిలో సమావేశం ఏర్పాటు చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణకు ప్లాన్‌‌‌‌ చేశారు. ఎమ్మెల్యే సామేల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ లీడర్లను కాదని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తూ, తమను పట్టించుకోవడం లేదని కొందరు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల అర్వపల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తుండగా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ స్థానిక నాయకులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు. 

అర్వపల్లి మీటింగ్‌‌‌‌కు వెళ్తున్న లీడర్ల అరెస్ట్‌‌‌‌

ఎమ్మెల్యే సామేల్‌‌‌‌ వ్యవహారాన్ని హైకమాండ్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లేందుకు సీనియర్‌‌‌‌ నాయకులంతా అర్వపల్లిలో మీటింగ్‌‌‌‌ నిర్వహణకు సిద్ధమయ్యారు. సమావేశం నిర్వహణకు రెండు రోజుల కింద అప్లై చేసుకోగా పోలీసులు పర్మిషన్‌‌‌‌ ఇవ్వలేదు. అయినప్పటికీ మీటింగ్‌‌‌‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో పోలీసులు శనివారం తెల్లవారుజామున అర్వపల్లి బ్లాక్‌‌‌‌ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు మరికొంత మంది నాయకులను అరెస్ట్‌‌‌‌ చేసి నూతనకల్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మిగతా లీడర్లు స్టేషన్‌‌‌‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అరెస్ట్‌‌‌‌ చేసిన లీడర్లను వెంటనే విడుదల చేయాలని, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్‌‌‌‌ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయినా కష్టపడి సామేల్‌‌‌‌ను గెలిపిస్తే ఇప్పుడు కూడా అదే నిర్బంధం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైకమాండ్‌‌‌‌ స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని, లేకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యే వ్యవహారంపై దసరా తర్వాత గాంధీ భవన్‌‌‌‌లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌, సీఎం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అర్వపల్లి మండల అధ్యక్షుడు యోగానందచారి తెలిపారు.