IPL 2025 Mega Auction: టెస్ట్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత.. భారత్‌కు ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి ఐపీఎల్ మెగా ఆక్షన్ పైనే ఉంది. మెగా ఆక్షన్ కావడంతో ఎవరు ఎంత ధర పలుకుతారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నవంబర్ 22-26 తేదీలలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. నవంబర్ 24,25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. టెస్ట్ మ్యాచ్ మూడు, నాలుగు రోజులు ఐపీఎల్ మెగా ఆక్షన్ తో క్లాష్ కానుంది. అయితే మ్యాచ్ ఉదయం 7:50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరో వైపు ఐపీఎల్ ఆక్షన్ మధ్యాహ్నం మొదలవుతుంది.

మెగా ఆక్షన్ కావడంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం భారత్ కు రానున్నారు. వాస్తవానికి వీరిద్దరూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు కామెంట్రీ చేయాల్సింది. ఐపీఎల్ మెగా ఆక్షన్ కారణంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లో కేవలం తొలి రోజు మాత్రమే కామెంట్రీ చేయనున్నారు. నవంబర్ 22 న తొలి టెస్టుకు కామెంట్రీ చేసి 23 న భారత్ కు బయలుదేరి 24 న ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉందనున్నట్టు తెలుస్తుంది. 

ఈ ఇద్దరు ఆసీస్ దిగ్గజాలు ఐపీఎల్ ఆక్షన్ కు రావడానికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ కు జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదిలి పంజాబ్ హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్, డేనియల్ వెటోరి ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరగబోయే తొలి టెస్టుకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.