బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు ఆటలో భారత స్టార్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొంటాస్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పిచ్ పక్కన నడిచే సమయంలో భారత స్టార్ ఆసీస్ యువ ఆటగాడి భుజాన్ని భౌతికంగా తాకుతూ నడిచి వెళ్లడం ఈ వాగ్వాదానికి దారితీసింది. ఈ ఘటనపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించారు.
కోహ్లీ కావాలనే కొంటాస్‌తో గొడవకు దిగినట్లు పాంటింగ్ వెల్లడించారు. ఈ ఘటన పొరపాటున జరిగినదని కాదని.. విరాట్ నడుస్తున్న తీరు చూస్తే అర్థమైపోతుందని పాంటింగ్ అన్నారు. కొంటాస్ తన దారిన తాను వెళ్తుంటే.. విరాట్ కావాలనే తన డైరక్షన్ మార్చుకున్నాడని ఆసీస్ మాజీ వ్యాఖ్యానించారు.
ఏం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల యువకుడు సామ్ కొంటాస్ ఆస్ట్రేలియా తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతని పట్ల కోహ్లీ అత్యుత్సాహం చూపాడు. ధాటిగా ఆడుతున్నాడన్న కోపంతో.. అతన్ని భుజంతో ఢీకొట్టడమే కాకుండా మాటల యుద్ధానికి దిగాడు. ఈ ఘటన బుమ్రా వేసిన 11వ ఓవర్‌లో చోటుచేసుకుంది. వెంటనే మరో ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా, అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్ది చెప్పారు. కోహ్లీ రెచ్చగొట్టాక.. కొంటాస్ మరింత చెలరేగిపోయాడు. తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 60 పరుగులు చేశాడు.
Kohli and Konstas come together and make contact ?#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024
నిషేతం తప్పదా..!
కోహ్లీ చర్యలు అతని ఏకాగ్రతను దెబ్బ తీసేలా ఉన్నప్పటికీ.. ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండడంతో భారత స్టార్ పై నిషేధం పడే అవకాశమున్నట్లు కథనాలు వస్తున్నాయి. ICC ప్రవర్తనా నియమావళి 2.12 ప్రకారం, ఇలాంటి ఘటనల్లో ఆటగాడిపై ఒక అంతర్జాతీయ మ్యాచ్ నిషేధం పడనున్నట్లు చెప్తున్నాయి. అదే లెవల్ 1 కింద నేరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కోహ్లి కేవలం జరిమానాతో తప్పించుకోవచ్చు. ఈ విషయంపై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.