దేశీయంగా సప్లైకి ముప్పు ఉండదు

దేశీయంగా సప్లైకి ముప్పు ఉండదు

న్యూఢిల్లీ: ఈసారి వరిసాగు విస్తీర్ణం తగ్గడం వల్ల బియ్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి 6-.7 కోట్ల టన్నుల వరకు తగ్గే ప్రమాదం ఉందని సాగురంగ నిపుణులు అంటున్నారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుండగా మరోవైపు ధరలు పెరుగుతున్నాయి. బియ్యం ధరలు మరింత ఎగిస్తే ఇన్​ఫ్లేషన్​ ఇంకా పెరుగుతుంది.  తృణధాన్యాలు సహా చాలా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్​ఫ్లేషన్ ​ఆగస్టులో 7 శాతానికి చేరుకుంది. టోకు ధరల ఇన్​ఫ్లేషన్​ 11-నెలల కనిష్టానికి పడిపోయింది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వేడిగాల వల్ల గోధుమ దిగుబడి తగ్గడంతో ధరల ఒత్తిడి ఎక్కువయింది. ఈ ఏడాది జూన్–-సెప్టెంబర్ వర్షపాతం తక్కువగా ఉండటం, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వెళ్లడంతో వరి పంటపై ఆందోళనలను పెంచింది.  కొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాల లోటు కారణంగా వరి పంట చేతికి రాలేదు. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన 2021-22 పంట సంవత్సరంలో భారతదేశపు వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో 130.29 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది మునుపటి సంవత్సరంలో 124.37 మెట్రిక్​ టన్నులు మాత్రమే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌‌‌‌లో బియ్యం ఉత్పత్తి 6-7 మెట్రిక్ టన్నుల తగ్గుతుందని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇది దేశం మొత్తం బియ్యం ఉత్పత్తిలో 85 శాతం. వరి దిగుబడిపై భయాందోళనలు అవసరం లేదని, రేషన్​షాపుల డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి బఫర్ స్టాక్ సరిపోతుందని అంటోంది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడం వల్ల పరిస్థితిని అదుపులో ఉంచవచ్చని చెబుతున్నది. గత ఏడాది కాలంగా బియ్యం, పశుగ్రాసం ధరలు పెరగడంతో ఈ ఆంక్షలు విధించారు. 

ఇది వరకే పెరిగిన ధరలు

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ  డేటా ప్రకారం.. బియ్యం టోకు ధరలు ఏడాది క్రితం క్వింటాల్‌‌‌‌కు రూ. 3,047.32 నుంచి సెప్టెంబర్ 14 నాటికి క్వింటాల్‌‌‌‌కు 10.7 శాతం పెరిగి రూ.3,357.2కి చేరుకున్నాయి. రిటైల్ ధరలు కిలోకు రూ.34.85 నుంచి 9.47 శాతం పెరిగి రూ.38.15కి చేరాయి.  ఆహార ధరలు పెరుగుతున్నాయని,  ప్రధానంగా తృణధాన్యాల కొరత ఇందుకు కారణమని ఆర్​బీఐ పేర్కొంది.సెప్టెంబరులో వర్షపాతం సరిగ్గా లేకపోవడంతో కూరగాయల ధరలు.. ముఖ్యంగా టొమాటోల ధరలను పెంచడానికి దారితీసింది.  సమర్థమైన ద్రవ్య విధానం,  అంతర్జాతీయ వస్తువుల ధరలు తగ్గడం,  సరఫరా -గొలుసులో ఇబ్బంది లేకపోవడం వల్ల ఇక ముందు ఇన్​ఫ్లేషన్​ తగ్గుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  

సమస్య ఉండదంటున్న ప్రభుత్వం

ఖరీఫ్​ బియ్యం ఉత్పత్తిలో  తగ్గుదల ఉన్నప్పటికీ, దేశీయంగా సప్లైకి ముప్పు ఉండదని నీతిఆయోగ్​ సభ్యుడు రమేష్ చంద్​​ చెప్పారు. ఎగుమతులను నియంత్రించడం ద్వారా ఇన్​ఫ్లేషన్​ను ప్రభుత్వం అరికడుతోందని, ఇది విజయవంతమైతే బియ్యం ఇన్​ఫ్లేషన్​ 5–-6 శాతానికి మించదని చంద్ అన్నారు. ఆగస్టులో బియ్యం ఇన్​ఫ్లేషన్​ 6.94 శాతంగా నమోదైందని, గత ఏడాది ఇదే నెలలో మైనస్ 1.2 శాతంగా ఉందని తాజా సీపీఐ డేటా వెల్లడించింది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలతో పోలిస్తే భారతదేశంలో పరిస్థితి బాగానే ఉందని వ్యవసాయ ఆర్థికవేత్త, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కార్యదర్శి పికె జోషి అన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, కేంద్రం ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను 80 కోట్ల మందికి కిలోకు రూ.2-3 కు అందిస్తుంది. 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద 80 కోట్ల మందికి మరో 5 కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా సరఫరా అవుతున్నాయి. పీఎంజీకేఏవై ఈ నెలలోనే ముగుస్తుంది. దీనిని పొడగించేదిలేనిదీ తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా బియ్యం ఉత్పత్తి  బాగానే ఉంది.  బఫర్ స్టాక్‌‌‌‌లు ఎక్కువయ్యాయి.  ఈ ఏడాది జులై నాటికి బఫర్ స్టాక్ 47 మెట్రిక్ టన్నులు.  ప్రపంచ బియ్యం వ్యాపారంలో 40 శాతం వాటాను కలిగి ఉన్న భారతదేశం, 2021-– 22 ఆర్థిక సంవత్సరంలో 21.23 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరంలో 17.78 మెట్రిక్​ టన్నులు అమ్మింది. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో  9.51 మెట్రిక్​ టన్నులను ఎగుమతి చేసింది.  ప్రస్తుత ఖరీఫ్‌‌‌‌లో సెప్టెంబర్ 16 నాటికి వరి విస్తీర్ణం 4.52 శాతం తగ్గి 399.03 లక్షల హెక్టార్లకు (ఎల్‌‌‌‌హెచ్) పరిమితమయింది. ఇది గత ఏడాది కాలంలో 417.93 లక్షల హెక్టార్లలో సాగు చేశారు.