ఆరుబయటే వడ్లు..కనీస జాగ్రత్తలు తీసుకోని రైస్  మిల్లర్లు

  • క్వాలిటీ లెవీ బియ్యం ఎలా ఇస్తారంటున్న స్థానికులు
  • గోదాములు లేకున్నా కెపాసిటీకి మించి వడ్లు కేటాయిస్తున్న ఆఫీసర్లు

గద్వాల, వెలుగు : రైస్  మిల్లులకు పెట్టిన వడ్లు తడిసి ముద్దవుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఓ వైపు తేమ ఉంది.. వడ్లు తడిసిపోయాయి.. ఆరబెట్టుకొని తీసుకురావాలంటూ మిల్లర్లు, కొనుగోలు సెంటర్  నిర్వాహకులు చెబుతుండగా, మరోవైపు మిల్లులకు ఇచ్చిన వడ్లు తడిసిపోతున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వాటిని మళ్లీ మిల్లర్ల నుంచి ఎలా సేకరిస్తుందని అంటున్నారు. కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను ఆరుబయట నిర్లక్ష్యంగా పడేస్తున్నారు.

అగ్రిమెంట్​ చేసుకునేటప్పుడు గవర్నమెంట్  ఇచ్చిన వడ్లను తడవకుండా జాగ్రత్తగా గోదాముల్లో దాచి పెట్టుకొని నాణ్యమైన లెవీ బియ్యాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. కొన్ని రైస్  మిల్లులకు కెపాసిటీకి మించి వడ్లు కేటాయించారనే విమర్శలున్నాయి. వడ్లు తీసుకున్న మిల్లు యజమానులు నాని పోయిన వడ్లతో క్వాలిటీ లేని బియ్యాన్ని ఇస్తే ఆ బాధ్యత ఎవరిదని అంటున్నారు. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో తీసుకున్న వడ్లను పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు దండుకున్నారు.

2.90 లక్షల క్వింటాళ్ల సేకరణ..

జోగులాంబ గద్వాల జిల్లాలో 74 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఇప్పటి వరకు 2.90,655 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేశారు. వాటిని జిల్లాలోని 31 రైస్  మిల్లులకు సమానంగా కేటాయించాల్సి ఉండగా, ముడుపులు ఇచ్చిన వారికి ఎక్కువ వడ్లు కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. రేకులపల్లి, కొత్తపల్లి, తురుకోనిపల్లి, ములకలపల్లె, తెలుగోనపల్లె కొనుగోలు సెంటర్ల నుంచి డబ్బులు ఇచ్చిన వారికే వడ్లు కేటాయించారనే ఆరోపణలున్నాయి.

కెపాసిటీ లేకున్నా ఎక్కువగా వడ్లు..

జిల్లాలో 64 రైస్  మిల్లులు ఉన్నాయి. వీటిలో ఈసారి సీఎంఆర్  వడ్ల కోసం కేవలం 31 రైస్  మిల్లులు మాత్రమే అర్హత సాధించాయి. ఇందులో కొందరు మిల్లర్లు ఆఫీసర్లతో కుమ్మక్కై ఎక్కువ వడ్లను కేటాయించుకున్నారని అంటున్నారు. గద్వాల మండలం గోన్పాడు సమీపంలోని ఓ రైస్ మిల్ కు రెండు టన్నుల కెపాసిటీ ఉంటే నాలుగు టన్నుల కెపాసిటీ ఉందంటూ తప్పుడు పత్రాలు చూపించి ఎక్కువ వడ్లు కేటాయించుకున్నారనే విమర్శలున్నాయి.

రెండు టన్నుల కెపాసిటీ రైస్  మిల్లుకు 37 వేల బస్తాలు కేటాయించాల్సి ఉన్నా, ఈ రైస్ మిల్లుకు 74 వేల బస్తాలు కేటాయించి సివిల్  సప్లై ఆఫీసర్లు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

వడ్లకు భద్రత కరువు..

సీఎంఆర్  కింద రైస్  మిల్లులకు ఇచ్చిన వడ్లకు భద్రత లేకుండా పోతోంది. రైస్  మిల్లర్లకు కెపాసిటీకి మించి వడ్లు కేటాయించడంతో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేస్తున్నారు. దీంతో వడ్లకు  భద్రత లేకుండా పోతుంది. ఆరుబయటే వానకు నానుతూ.. ఎండకు ఎండుతూ సీఎంఆర్  వడ్లు చెడిపోయే పరిస్థితి ఉంది. వాస్తవంగా మిల్లులకు కేటాయించిన వడ్ల బాధ్యత వారిదే. గోదాముల్లో నిల్వ చేసుకొని క్వాలిటీ లెవీ బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

రూల్స్  ప్రకారమే వడ్ల కేటాయింపు..

రైస్  మిల్లులకు రూల్స్  ప్రకారమే వడ్లు కేటాయిస్తున్నాం. సీఎంఆర్  కింద ఇచ్చిన వడ్ల భద్రత బాధ్యత పూర్తిగా రైస్  మిల్లర్లదే. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వడ్లు కేటాయించలేదు. రైస్  మిల్లర్లు వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. రూల్స్  పాటించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం.

 - స్వామి కుమార్, డీఎస్​వో, గద్వాల