తగ్గేది లేదంటున్న రామ్ గోపాల్ వర్మ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్.. విచారణ వాయిదా..

కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్దమైన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ చేసిన మార్ఫింగ్ పోస్టులపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని రెండుసార్లు నోటీసులు పంపగా.. డుమ్మా కొట్టాడు ఆర్జీవీ. దీంతో వర్మను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు ఏపీ పోలీసులు. అయితే.. పోలీసు విచారణను తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు వర్మ. గతంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వర్మ, తాజాగా తనపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలంటూ మరో పిటీషన్ దాఖలు చేశారు వర్మ.

ఈ పిటీషన్ పై ఇవాళ ( నవంబర్  28, 2024 ) విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి ( డిసెంబర్ 2, 2024 )  వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. గత నాలుగురోజులుగా అజ్ఞాతంలో ఉన్న వర్మ, తాను ఎక్కడికీ పారిపోలేదంటూ రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్నారు. దీంతో అర్జీవిని అరెస్ట్ చేయటం ఏపీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలతో హైదరాబాద్, చెన్నైలలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు ప్రకాశం పోలీసులు.