ఇండియా షట్లర్లు సాధించిందేమి లేదు

ఇండియా షట్లర్లు సాధించిందేమి లేదు

ఇటు సింధు.. అటు సైనా..! ఓ వైపు శ్రీకాంత్‌‌.. మరోవైపు సాయి ప్రణీత్‌‌..! వరుస పెట్టి పతకాలు..! ఒకరిని మించి మరొకరు అన్నట్టు విజయయాత్రలు..! మేమేం తక్కువా అన్నట్టు డబుల్స్‌‌ జంటలు అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, సాత్విక్‌‌ సాయిరాజ్‌‌-చిరాగ్‌‌ శెట్టి, సుమీత్‌‌ రెడ్డి-మను అత్రి అదరగొడుతుంటే కొన్నేళ్ల నుంచి ఇండియా బ్యాడ్మింటన్‌‌ బుల్లెట్‌‌ వేగంతో దూసుకెళ్లింది..! కానీ, ఈ ఇయర్‌‌ మాత్రం మన షట్లర్ల జోరుకు బ్రేకులు పడ్డాయి.! వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో గోల్డ్‌‌ నెగ్గిన సింధు హిస్టరీ క్రియేట్‌‌ చేసినా మిగతా సందర్భాల్లో మన రాకెట్లు తుస్సుమన్నాయి..!

(వెలుగు క్రీడా విభాగం)

ఇండియా బ్యాడ్మింటన్‌‌కు 2019 నిరాశనే మిగిల్చింది. స్టార్ ప్లేయర్ పీవీ సింధు వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ టైటిల్‌‌, అదే టోర్నమెంట్‌‌లో సాయి ప్రణీత్‌‌ కాంస్యం సాధించడం మినహా ఇండియా షట్లర్లు సాధించిందేమి లేదు. ఒలింపిక్స్ ముందు కీలకమైన ఈ ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా విఫలమయ్యారు. కొందరు ఫిట్‌‌నెస్ సమస్యలతో తడబడగా.. మరి కొందరు పేలవ ఆటతీరుతో నిరాశ పరిచారు. టీనేజ్‌‌ సెన్సేషన్ లక్ష్యసేన్‌‌ ఒక్కడే.. ఐదు టైటిళ్లతో భవిష్యత్తుపై ఆశలు కలిగించినా.. మరో ఏడు నెలల్లో మెగా ఈవెంట్‌‌ ఉన్న నేపథ్యంలో సీనియర్ల వైఫల్యం ఆందోళనకు గురిచేస్తోంది. వెరసి ఈ ఏడాది ఇండియా బ్యాడ్మింటన్‌‌కు భారంగానే గడిచింది.

సాయి ప్రణీత్‌‌ మినహా ..

వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్ మెడల్‌‌ నెగ్గిన సాయిప్రణీత్.. 36 ఏళ్ల ప్రకాశ్ పదుకోన్‌‌ రికార్డును సమం చేయగా.. సౌరభ్ వర్మ రెండు సూపర్ 100 టైటిళ్లతో(హైదరాబాద్, వియాత్నం) మెరిశాడు. ఇవి మినహా పురుషుల సింగిల్స్‌‌లో ఈ ఏడాది ఇండియాకు దక్కిందేమిలేదు. మిగతా షట్లర్లు పూర్తిగా విఫలమయ్యారు. అరడజను ప్లేయర్లు టాప్‌‌–32లో ఉన్నా.. వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌ పురుషుల సింగిల్స్‌‌కు ఇండియా నుంచి ఒక్కరు కూడా క్వాలిఫై కాలేకపోయారు. అయితే,  వరల్డ్ చాంపియన్‌‌షిప్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌తో పాటు, స్విస్ ఓపెన్‌‌ ఫైనల్‌‌, కొన్ని టోర్నీల్లో క్వార్టర్స్‌‌, సెమీస్‌‌కు చేరడంతో ప్రణీత్‌‌ కెరీర్‌‌‌‌ బెస్ట్ 11వ ర్యాంక్‌‌ అందుకున్నాడు. గత రెండేళ్లలో అద్భుత పెర్ఫామెన్స్‌‌ కనబర్చి నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ అందుకున్న కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది పూర్తిగా తేలిపోయాడు. ఈ సీజన్‌‌లో 16 టోర్నీల్లో బరిలోకి దిగినా ఒక్క టైటిల్‌‌ కూడా నెగ్గలేకపోయాడు. ఇండియా ఓపెన్‌‌లో  ఫైనల్‌‌కు  చేరడమే అతని బెస్ట్‌‌ పెర్ఫామెన్స్. మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డ అతను.. వరుస వైఫల్యాలతో ర్యాంకింగ్స్‌‌లో కూడా దిగజారిపోయాడు. మాజీ నంబర్‌‌ వన్‌‌ కిడాంబి టాప్‌‌–10 నుంచి బయటకొచ్చి..12వ ర్యాంకుకు పడిపోయాడు. ఇక, డెంగ్యూతో ఇబ్బంది పడిన హెచ్‌‌ ఎస్ ప్రణయ్ కూడా 26వ ర్యాంకుతో ఈ సీజన్‌‌ను ముగించాడు. సమీర్‌‌ వర్మ కూడా పెద్దగా రాణించింది లేదు.

లక్ష్యసేన్‌‌…నయా సెన్సేషన్‌‌

సీనియర్లు విఫలమైన వేళ జూనియర్ షట్లర్ లక్ష్యసేన్‌‌ అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో 109వ ర్యాంకులో ఉన్న అతను.. సీజన్‌‌ ముగిసే సరికి 32వ ర్యాంకుకు చేరడం విశేషం. పోలిష్ ఓపెన్, బెల్జియం, డచ్ ఓపెన్, సార్లొర్‌‌లక్స్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ చాలెంజ్‌‌లతో మొత్తం 5 టైటిళ్లు గెలిచి ఔరా అనిపించాడు. ఈ విజయాలతో తన ర్యాంక్‌‌ను అమాంతం పెంచుకున్న 19 ఏళ్ల లక్ష్య.. పెద్ద టోర్నీల్లో పోటీకి రెడీ అయ్యాడు. వచ్చే ఏడాది కూడా అతను ఇదే జోరు కొనసాగిస్తే.. పురుషుల సింగిల్స్‌‌లో ఇండియా నుంచి అతను స్టార్‌‌ షట్లర్‌‌గా ఎదిగే అవకాశాలు పుష్కలం.

డబుల్స్ .. ట్రబుల్స్

డబుల్స్‌‌లో ఇండియా షట్లర్ల ట్రబుల్‌‌ కొనసాగింది. సాత్విక్ సాయిరాజ్-– చిరాగ్ శెట్టి ద్వయం థాయ్‌‌లాండ్‌‌ సూపర్‌‌‌‌ 500 టైటిల్‌‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ –750  టోర్నీలో రన్నరప్‌‌గా నిలిచి ఆకట్టుకున్నా చివర్లో తడబడ్డారు. థాయ్‌‌లాండ్‌‌ విజయంతో తొలిసారి టాప్–10లోకి వచ్చిన ఈ యువ ద్వయం చరిత్ర సృష్టించింది. భుజం గాయం కారణంగా వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌కు దూరమైన సాత్విక్‌‌ కోలుకున్న తర్వాత ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో చిరాగ్‌‌తో కలిసి ఫైనల్‌‌ చేరి గాడిలో పడినట్టు కనిపించాడు.. కానీ, తర్వాత ఆటలో వెనుకబడిన ఈ జోడీ  12వ ర్యాంక్‌‌తో సీజన్‌‌ను ముగించింది.  సుమీత్‌‌ రెడ్డి––మను అత్రి జంటకు  ప్రధాన టోర్నీల్లో నిరాశే ఎదురైంది. మహిళలు, మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అశ్విని పొన్నప్ప–-సిక్కిరెడ్డి జోడీ 30 ర్యాంక్‌‌కు పడిపోయింది. 21 టోర్నీల్లో పాల్గొన్న ఈ జంట 13 సార్లు తొలి రౌండ్లలోనే వెనుదిరగ్గా.. మూడు సార్లు సెకండ్ రౌండ్‌‌లో నిష్క్రమించింది . మిక్స్‌‌డ్‌‌లో అశ్విని–సాత్విక్‌‌ జోడీ 35వ ప్లేస్‌‌కు దిగజారింది. సాత్విక్‌‌కు గాయం కారణంగా సీజన్‌‌లో ఈ జంట ఏడు టోర్నీల్లో మాత్రమే ఆడింది. మిగతా డబుల్స్‌‌ ప్లేయర్లు చిన్నాచితక టోర్నీల్లో తప్పితే.. చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్‌‌ చేయలేదు.

ఫారిన్ కోచ్‌‌ల సహకారం

ఈ ఏడాది ఇండియా బ్యాడ్మింటన్‌‌కు ఫారిన్ కోచ్‌‌లు టన్ కిమ్‌‌ (మలేషియా), కిమ్ జు హ్యూన్ (కొరియా) సేవలందించారు. హెడ్‌‌ కోచ్‌‌ పుల్లెల గోపీచంద్‌‌ సైతం కోచ్‌‌ల అవసరాన్ని నొక్కిచెప్పాడు. మరో ఏడునెలల్లో ఒలింపిక్స్‌‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో గాడి తప్పిన ఇండియా బ్యాడ్మింటన్ ప్లేయర్లను ట్రాక్‌‌లోకి తీసుకురావడం గోపీచంద్‌‌కు కఠిన సవాలే.