ఆర్మీ జవాన్ అయితే ఏంటి..డబ్బులు ఇవ్వాల్సిందే!

  •     కొందుర్గు తహసీల్దార్ ఆఫీసులో అవినీతి బాగోతం
  •     పాత ఆర్ఓఆర్ పహాణీ కోసం జవాన్ వద్ద రూ. 30 వేలు లంచం తీసుకున్న రెవెన్యూ సిబ్బంది 
  •     డబ్బులిస్తేనే పని.. లేదంటే ఆఫీసు చుట్టూ తిరగాల్సిందే
  •     తనకు జరిగిన పరిస్థితిపై  ఆవేదన వ్యక్తం చేసిన ఆర్మీ జవాన్ 

షాద్ నగర్, వెలుగు :  ఆ తహశీల్దార్ ఆఫీసులో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా వేలల్లో డబ్బులు ముట్ట చెప్పాల్సిందే..! లేకపోతే ఎలాంటి పని జరగదు. రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటారు. అదే.. వారు అడిగినంత డబ్బు ఇస్తే రోజుల్లోనే పని చేసి పెడతారు. ఇదీ కొందుర్గు తహసీల్దార్ ఆఫీసులోని పరిస్థితి. వివరాల్లోకి వెళితే... కొందూరు మండలంలోని విశ్వనాథపూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి ఆర్మీ జవాన్.  గత జనవరిలో అతడు తన భూమికి ఆర్ఓఆర్ పహాణీలు కావాలని కొందుర్గు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. రికార్డు సెక్షన్ లోని బాలరాజ్, హేమంత్ వద్దకు వెళ్లి పహాణీలు కావాలని అడిగి దరఖాస్తు చేశాడు. 

వారం తర్వాత రమ్మని చెప్పగా..

వారం తర్వాత రావాలని అతనితో ఆఫీసు సిబ్బంది చెప్పారు. వారం దాటాక వెళ్లి అడిగితే.. ఓల్డ్ డాక్యుమెంట్స్ వెతకడానికి చాలా టైం పడుతుందని, అందుకు రూ. 40 వేలు కట్టాల్సి ఉంటుందని.. అమౌంట్ ఇస్తే ప్రాసెస్ చేస్తామని అతనికి సూచించారు. తను ఆర్మీ జవాన్ అని అంత ఇవ్వలేను రూ. 3 వేలు తీసుకోండని చెప్పాడు. ఓల్డ్ డాక్యుమెంట్స్​కు వాటి సర్వే నంబర్లు చాలా ఉన్నాయని రూ. 40 వేలు లేదంటే  రూ. 30 వేలు అయినా ఇవ్వాలని ఆఫీసు సిబ్బంది డిమాండ్ చేశారు. అంత డబ్బు ఎందుకు అవేమీ దొంగ డాక్యుమెంట్ కాదు కదా.. అంత డబ్బులు ఇవ్సాల్సిన అవసరం ఎందుకు..? అని ఆర్మీ జవాన్ ప్రశ్నించాడు. సెక్షన్  సిబ్బంది బలరాజ్,హేమంత్  డబ్బులు తమకు కాదని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్​కు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఆర్మీ జవాన్ ఒకసారి తహసీల్దార్ ను కలిసి మాట్లాడతానంటే..  రికార్డ్ సెక్షన్ సిబ్బంది కుదరదని చెప్పారు. దీంతో అడిగిన డబ్బులు ఇస్తానని అశోక్ రెడ్డి తెలపడంతో  3 రోజుల తర్వాత రమ్మని సెక్షన్ సిబ్బంది చెప్పారు. మళ్లీ అశోక్ రెడ్డి ఆఫీసుకు వెళ్లగా డాక్యుమెంట్స్ దొరికాయని, డబ్బులు ఇవ్వండి సంతకం పెట్టి ఇప్పిస్తామని ఆఫీసు సెక్షన్ సిబ్బంది అతనికి తెలిపారు. 

సైనికుడిని అని చెప్పినా వినకుండా వసూలు  

అనంతరం ఆఫీసుకు వెళ్లి అశోక్ రెడ్డి రూ. 10 వేలు నగదుగా ఇవ్వగా డాక్యుమెంట్స్ ప్రింట్ తీశారు.  మిగతా డబ్బులు కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయగా రెండు రోజుల తర్వాత వచ్చి మొత్తం డబ్బులు ఇచ్చి తీసుకెళ్తానని ఆర్మీ జవాన్ తెలిపాడు. మళ్లీ రెండు రోజుల తర్వాత వెళ్లి ఫోన్ పే, క్యాష్ గా మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాతనే డాక్యుమెంట్స్ ఇచ్చారని అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన ఘటనను సెల్ఫీ వీడియోగా తీసుకుని శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే.. ఊరి నుంచి వెంటనే కాశ్మీర్ లో డ్యూటీకి వచ్చానని, దీంతో అప్పట్లో తహసీల్దార్ ఆఫీసులో జరిగిన అవినీతిపై వెల్లడించలేకపోయనని పేర్కొన్నారు.

దీనిపై అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. బార్డర్ లో సేవ చేసే సైనికుడు అని  చెప్పినా.. వినకుండా వేలల్లో డబ్బులు తీసుకుని రెవెన్యూ అధికారులు, సిబ్బంది డాక్యుమెంట్స్ ఇచ్చారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదనతో చెప్పాడు.   కొందుర్గ్ తహశీల్దార్ ఆఫీసులోని రికార్డ్ సెక్షన్ లోని సిబ్బందిలో హేమంత్ కు ఎలాంటి జాబ్  లేదని.. ఉన్నతాధికారులే ప్రైవేటుగా నియమించుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆర్మీజవాన్ ఆరోపించాడు. కొందుర్గు రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. 

నివేదిక సమర్పిస్తాం

దీనిపై కొందుర్గు తహసీల్దార్ రమేష్ కుమార్ ను ఫోన్ లో వివరణ కోరగా.. తను నెల రోజుల నుంచి అందుబాటులో లేనని, లీవ్ లో ఉన్నానని సమాధానమిచ్చారు. ఆఫీసు నుంచి ఆర్మీ జవాను కోరిన పాత ఆర్ఓఆర్ డాక్యుమెంట్స్ పై  ఏం జరిగిందనేది  డిప్యూటీ తహసీల్దార్ నుంచి వివరణ తీసుకుని సోమవారం నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
 - తహసీల్దార్ రమేశ్​కుమార్