‘రామాలయ’ నిర్వాసితులకు బ్రిడ్జి పాయింట్​లో ఇండ్ల స్థలాలు!

  • ఒక్కో కుటుంబానికి 2 సెంట్లు 
  • మెరుగైన పరిహారం అందించేందుకు ఆఫీసర్ల ప్లాన్​

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నూతనంగా చేపట్టబోయే ప్రాకారాల నిర్మాణాల కోసం రెవెన్యూశాఖ భూసేకరణ చేపడుతోంది. ఈ భూసేకరణ ద్వారా నిర్వాసితులయ్యే వారికి మెరుగైన పరిహారం అందించేందుకు అధికారులు ప్లాన్​ సిద్ధం చేశారు. విలువైన భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు అంతే స్థాయిలో ఇంటికి స్థలం కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. గోదావరి బ్రిడ్జి పాయింట్​లోని ఆర్​అండ్​బీ శాఖ నుంచి గతంలో ప్రసాద్​ స్కీం కోసం సేకరించిన 3 ఎకరాల భూమిని ఇవ్వడానికి జిల్లా కలెక్టర్​కు ప్రతిపాదనలు పంపించారు.

త్వరలోనే దీనిపై నోటిఫికేషన్​ రిలీజ్​ కానుంది. రామాలయం అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.60.20కోట్లను భూసేకరణ కోసం 2024-25 ప్రత్యేక నిధులు జీవో నెంబర్​246ను జారీ చేసిన సంగతి విదితమే. గతేడాది మార్చి 11న సీఎం రేవంత్​రెడ్డి తొలిసారి భద్రాచలంలో రామాలయం సమగ్రాభివృద్ధి కోసం మీటింగ్​ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగాఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​ నుంచి ఆర్కిటెక్​ సూర్యనారాయణమూర్తి వచ్చి మార్చి 27న చేపట్టే పనుల గురించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేశారు. ఆ తర్వాత పలు దఫాలుగా రెవెన్యూ, ఎండోమెంట్​ ఆఫీసర్లు సర్వేలు చేసి భూసేకరణకు ప్రతిపాదనలు పంపారు. 

2 సెంట్ల చొప్పున.. 

ఆలయం చుట్టూ సుమారు ఎకరానికి పైగా భూమిని సేకరిస్తున్నారు. దీనిలోభాగంగా 43 ఇళ్లు ప్రభుత్వం తీసుకుంటుంది. ఆర్​అండ్​బీ స్థలం 3 ఎకరాలు ఉంది. ఈ స్థలంలో ఒక్కో కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇంటి కోసం ఇవ్వనున్నారు. అయితే ఆర్​అండ్​ఆర్​ప్యాకేజీలో భాగంగా నిబంధనలను అనుసరించి ఆ ఇంటిలోని ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు, మేజర్​ ఆడపిల్లలు(పెళ్లికానివారు మాత్రమే)కు అవకాశం ఇస్తారు.

స్థలంతో పాటు పరిహారం కూడా రానుంది. అలా చూస్తే సుమారు 65 మందికి ఇంటి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది. విజయవాడ-జగదల్​పూర్​జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ స్థలం చాలా విలువైనది కావడంతో నిర్వాసితులు కూడా ఓకే చెప్పేశారు. కలెక్టర్​నుంచి అనుమతి వచ్చాక ఎంపిక చేసిన వారికి డ్రా పద్ధతిలో స్థలాలు కేటాయించే అవకాశం ఉంది. రోడ్లు, సెంట్రల్​ లైటింగ్​ సిస్టం, తాగునీటి వసతి ఇవన్నీ ప్రభుత్వం కల్పించనుంది. 

ఆర్​అండ్​బీ స్థలం ఓకే అయ్యింది

రామాలయం అభివృద్ధి కోసం సేకరించే భూమిలో నిర్వాసితులైన వారి కోసం గోదావరి బ్రిడ్జి పాయింట్​లో స్థలం కేటాయించినం. వారి అభిప్రాయం మేరకు ప్రభుత్వం కూడా ఆర్​అండ్​బీ స్థలాన్ని ఓకే చేసింది. ఇళ్లు కోల్పోతున్న వారికి ఇక్కడ ఇస్తం. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

- దామోదర్, ఆర్డీవో, భద్రాచలం