కబ్జాలకు చెక్.. హౌసింగ్ భూములకు ప్రహరీ గోడలు

  • దిల్, హౌసింగ్ బోర్డుకు వెయ్యి ఎకరాలకు పైగా ల్యాండ్స్
  • రూ.37 కోట్లతో ఫెన్సింగ్​కు ఏర్పాట్లు 
  • మార్చి చివరికి పూర్తయ్యేలా పనులు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టవ్యాప్తంగా హౌసింగ్ బోర్డు, దిల్(దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్)కు ఉన్న భూములు కబ్జా కాకుండా, ప్రహరీ గోడలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 37 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. ఇప్పటికే రూ. 25 కోట్లను శాంక్షన్ చేయగా, 16 ప్యాకేజీలుగా విడగొట్టి హౌసింగ్ బోర్డు అధికారులు టెండర్లు పిలిచారు. బోర్డు పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి 422 ఎకరాలు, దిల్ కు 620 ఎకరాల భూములు ఉన్నాయి. 

వీటిలో కబ్జా కాని, కోర్టు వివాదాలు లేని భూముల చుట్టూ వచ్చే మార్చి చివరి నాటికి ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులపై హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ అధికారులతో చర్చించి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు కోట్లలో పలుకుతుండగా ప్రభుత్వ భూములపై నిఘా లేకపోవటంతో పెద్ద ఎత్తున కబ్జాకు గురవడం, కోర్టుల్లో కేసులు దాఖలు చేయడం, అవి పరిష్కారం కాకుండా పెండింగ్‎లో ఉండటం వంటి వివాదాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. హౌసింగ్ బోర్డులో అధిక శాతం భూములు హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఉన్న జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. వీటన్నింటి చుట్టూ ఫెన్సింగ్ లేదా రక్షణ గోడ నిర్మించాలని, జియో గ్రాఫికల్ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కబ్జాకు గురైన వాటిని తిరిగి పొందేందుకు న్యాయపరమైన చర్యల కోసం అడ్వకేట్లతో చర్చిస్తున్నామని, వీటిని త్వరగా పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. 

ప్రహరీ గోడలు నిర్మించే ప్రాంతాలు ఇవే..

వట్టి నాగుల పల్లి (రాజేంద్ర నగర్ ),  రాయదుర్గం, బాచుపల్లి, చింతల్, ఖైతలాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, మామిళ్లగూడ(నల్గొండ), దేవరకొండ, మునుగోడు, మారేడుపల్లి, కోహెడ(రంగారెడ్డి ), మంగల్ పల్లి, రావిర్యాల, పోచారం (ఘట్​కేసర్),  రాజిపేట(పరకాల), గొర్రెకుంట( గీసుకొండ), జగిత్యాల, మరిపెడ, చుంచుపల్లి (భద్రాద్రి కొత్తగూడెం), రత్నాపూర్(నిర్మల్), ఎన్సాన్ పల్లి, ఇబ్రహీంనగర్ (సిద్దిపేట).