చిన్న ఇన్వెస్టర్లే మార్కెట్​ను నడుపుతున్నరు

చిన్న ఇన్వెస్టర్లే మార్కెట్​ను నడుపుతున్నరు
  • కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: స్టాక్​ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఫారిన్​ ఇన్వెస్టర్లు వెళ్లిపోయినా, రిటైల్​ ఇన్వెస్టర్ల షాక్​ అబ్జార్బర్లలా పనిచేస్తూ దానిని నిలబెడుతున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.    ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహమ్మారి సమయంలో రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య చాలా  పెరిగిందని అన్నారు. “రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీళ్లు మార్కెట్​కు షాక్ అబ్జార్బర్ల వలె పనిచేస్తున్నారు. ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్​పీఐ)లు దూరంగా వెళ్లిపోయినా మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపించలేదు. ఎందుకంటే దేశంలోని చిన్న పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు” అని ఆమె చెప్పారు.  ఈ ఏడాది మార్చిలో, యాక్టివ్​ డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు కోట్ల మార్కును తాకినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్​ తెలిపిన నేపథ్యంలో ఈమె ఈ కామెంట్స్​ చేశారు. ఇటీవల  పెరుగుతున్న ఇన్​ఫ్లేషన్​, యుద్ధం వంటి ఒత్తిళ్లను అరికట్టడానికి ఆర్​బీఐ రెపోరేట్లను పెంచింది. మానిటరీ పాలసీని కఠినతరం చేసింది. దీంతో స్టాక్ మార్కెట్​లో ఒడిదుడుకులు ఎక్కువ అవుతున్నాయి. విదేశీ పోర్ట్​ఫోయో పెట్టుబడిదారులు అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు.

టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఆపండి
టెక్నాలజీని దుర్వినియోగం కాకుండా ఉండేలా డిజిటలైజేషన్​ను అర్థం చేసుకోవాలని రెగ్యులేటర్లకు ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా సూచించారు. సైబర్​దాడుల వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఫైర్​వాల్​ మెకానిజం తప్పనిసరి అని అన్నారు.  న్యాయమైన,  జవాబుదారీ పద్ధతులను అమలు చేయాలని అన్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా ఉండేలా  కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)  నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చూడాలని నిర్మలా సీతారామన్​ సూచించారు.