ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అవాంతరాలను అధిగమిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, గురువారం రాత్రి ఐరన్ గ్రిడ్ అడ్డుపడడంతో డ్రిల్లింగ్ పనులకు బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయానికి అడ్డంకిని తొలగించినా.. సాయంత్రం వరకూ డ్రిల్లింగ్ మొదలు పెట్టడం కుదరలేదని అధికారులు చెప్పారు. తీరా డ్రిల్లింగ్ మొదలుపెట్టిన కాసేపటికే మరో అవాంతరం ఎదురైంది. దీంతో తవ్వకపు పనులు మళ్లీ నిలిచిపోయాయి.
డ్రిల్లింగ్ మెషిన్‌కు మరమ్మతులు..
రెస్క్యూ ఆపరేషన్ పై నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ మహమూద్ అహ్మద్, ఉత్తరాఖండ్ ఆఫీసర్ నీరజ్ ఖైర్వాల్ శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ‘‘గురువారం అర్ధరాత్రి డ్రిల్లింగ్ మెషిన్ కు మెటల్ పైపు అడ్డుతగిలింది. అది మెషిన్ బ్లేడ్ ల చుట్టూ చుట్టుకుంది. దీంతో పనులు ఆపేయాల్సి వచ్చింది. బ్లేడ్లను రిపేర్ చేసేందుకు కొన్ని గంటల టైమ్ పట్టింది.
ఇప్పుడు మెషిన్ సిద్ధమైంది” అని తెలిపారు. ‘‘ఇప్పటి వరకు 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయింది. ఇంకో 10 నుంచి 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. ఆరు మీటర్ల చొప్పున ఉన్న పైపులు మరో రెండు లోపలికి పంపించాల్సి ఉంది. దాదాపు 5 మీటర్ల వరకు ఎలాంటి మెటల్స్ అడ్డుగా లేవని, డ్రిల్లింగ్ సాఫీగా సాగుతుందని రాడార్ సిబ్బంది అంచనా వేశారు. అంతా సవ్యంగా జరిగితే, త్వరలోనే కార్మికులను చేరుకుంటాం” అని చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్..
ఎస్కేప్ రూట్ సిద్ధమైన తర్వాత టన్నెల్ లోని కార్మికులను ఎలా బయటకు తీసుకురావాలనే దానిపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. డ్రిల్లింగ్ ద్వారా ఏర్పాటు చేసిన పైపుల గుండా స్ట్రెచర్ ను లోపలికి పంపిస్తారు. కార్మికులు దానిపై పడుకున్న తర్వాత తాడుతో బయటకు లాగుతారు. ఇలా ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తారు. ఆపై వారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు.
ఉత్తరకాశీలోనే కేంద్రమంత్రి, సీఎం..
కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రెండ్రోజులుగా ఉత్తరకాశీలోనే ఉన్నారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
