న్యూఢిల్లీ : రెనాల్ట్ 7 సీటర్ మల్టిపర్‌పస్ వెహికిల్ ట్రైబర్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.4.95 లక్షల నుంచి ప్రారంభమై.. రూ.6.49 లక్షల వరకు ఉన్నట్టు రెనాల్ట్ ప్రకటించింది. 2022 వరకు ప్రతేడాది ఒక కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు రెనాల్ట్ తెలిపింది. ఆ కొత్త ప్రొడక్ట్స్‌ను ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసమే డిజైన్ చేసి, డెవలప్ చేస్తామని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో తమ అమ్మకాలను రెండింతలు పెంచుకుంటామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లపై రెనాల్ట్ ఎక్కువగా దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. రెనాల్ట్ ప్రస్తుతం వార్షికంగా 80 వేల యూనిట్లను విక్రయిస్తోంది.
వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్యను 2 లక్షల యూనిట్లకు పెంచనుంది. ‘ప్రతేడాది ఇండియాలోకి ఒక కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేస్తాం. ఇండియన్ మార్కెట్ కోసం ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌ను తీసుకొస్తాం. ట్రైబర్ లాగా వాటిని కేవలం ఇండియన్ కస్టమర్ల కోసమే డిజైన్ చేస్తాం’ అని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె చెప్పారు. బ్రెజిల్, రష్యాలో సక్సెస్ అయిన ప్రొడక్ట్‌లను ఇక్కడకు తీసుకురావాలనుకోవడం లేదన్నారు.
