telangana NEET counselling : గుడ్‌న్యూస్ : నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులకు ఊరట

నీట్ కౌన్సెలింగ్ విషయంలో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్థానికత వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పారు. 

స్థానికతను నిర్థారిస్తూ... నాలుగు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కౌన్సెలింగ్ సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారికి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీంతో విద్యార్థులు కౌన్సెలింగ్ కి హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

కేవలం రెండు, మూడు సంవత్సరాలు చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత దూరం చేయకూడదని విద్యార్థుల తరపు న్యాయవాది వాదించారు. మెరిట్స్ లోకి వెళ్లే అంత సమయం ఇప్పుడు లేకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సీజేఐ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున.. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్ కి హారయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం ప్రతివాదులందరికి నోటీసులు పంపింది.