న్యూఢిల్లీ: కంపెనీ విస్తరణ కోసం రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ భారీ ప్లాన్లను ప్రకటించారు. టెలికం, ఆయిల్ టూ కెమికల్ వ్యాపారాలను భారీగా పెంచుతామని యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందించడానికి రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. రిలయన్స్ జియో అక్టోబర్ నాటికి మెట్రో సిటీల్లో 5జీ సేవలను లాంచ్ చేస్తుందని సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన జియో దీపావళి నాటికి ముంబై, ఢిల్లీ, చెన్నై కోల్‌కతా సహా వివిధ నగరాల్లో 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తుంది. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తుంది. మనదేశంలో 5జీ సొల్యూషన్‌లను అభివృద్ధి చేయడానికి రిలయన్స్ క్వాల్‌కామ్‌తో చేతులు కలిపింది. 2023 డిసెంబర్ నాటికి భారతదేశంలోని ప్రతి పట్టణం, మండలాలకు జియో 5జీని డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ 5జీ రోల్‌అవుట్ ప్లాన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదని, దేశంలో జియో ఫైబర్‌కు 11 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ఉందని అంబానీ ఈ సందర్భంగా ప్రకటించారు. క్వాల్కామ్ సాయంతో అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తామన్నారు. క్లౌడ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి గూగుల్‌తో చేతులు కలిపింది. ఈ సందర్భంగా జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ జియో ఎయిర్‌ఫైబర్‌ని ప్రకటించారు. ఇంట్లో, కార్యాలయాల్లో ఎటువంటి వైర్లు లేకుండా దీనిద్వారా గిగాబైట్-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. వై–ఫై హాట్‌స్పాట్‌గానూ ఇది పని చేస్తుంది.
ఓ2సీ బిజినెస్‌కు రూ.75 వేల కోట్లు
ఆయిల్ టూ కెమికల్ బిజినెస్(ఓ2సీ) ను భారీగా విస్తరిస్తామని రిలయన్స్ ఈ సందర్భంగా ప్రకటించింది. కంపెనీ 2025 నాటికి 20 గిగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని, 2030 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధిస్తుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జామ్‌నగర్‌లో ‘ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ న్యూ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్’ కోసం రూ. 75వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. బ్యాటరీలనూ తయారు చేస్తామన్నారు. పారిశ్రామిక విప్లవం వల్ల మేలు జరిగినా, పర్యావరణానికి చాలా నష్టాన్ని కలిగించిందని చెప్పారు. అందుకే క్లీన్ ఎనర్జీకి భారీగా పెట్టుబడులు అవసరమన్నారు. ఇదిలా ఉంటే, జామ్‌నగర్‌లో 5వేల ఎకరాలకు పైగా కొత్త సోలార్ గిగా ఫ్యాక్టరీ, ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను కూడా నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర పునరుత్పాదక ఇంధన తయారీ ప్లాంట్‌లలో ఒకటి అవుతుంది. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌కు 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీ ఉంటుంది. ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ అనే నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపిస్తామని అంబానీ ఈ సందర్భంగా చెప్పారు. సౌరశక్తితో పాటు బయో-ఎనర్జీ, ఆఫ్‌షోర్ విండ్, రెన్యువబుల్ ఎనర్జీల బిజినెస్‌లలోనూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ న్యూఎనర్జీ బిజినెస్‌కు నాయకత్వం వహిస్తాడని వెల్లడించారు. రిటైల్ బిజినెస్ ఇషా అంబానీ చేతుల్లో ఉంటుంది. ఇదిలా ఉంటే, సోషల్ మీడియా దిగ్గజం మెటా, రిలయన్స్ జియో కలిసి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సప్‌లో మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ విధానాన్ని ప్రారంభించింది. కస్టమర్లు చాట్ చేయడం ద్వారా జియోమార్ట్ నుంచి షాపింగ్ చేయవచ్చు. రిలయన్స్ రిటైల్ తన ఎఫ్‌ఎంసీజీ (రోజువాడే సబ్బులు, షాంపూలు, పాలు వంటివి) వ్యాపారాన్ని ఈ సంవత్సరం ప్రారంభించనుందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ సోమవారం తెలిపారు. ఈ వ్యాపారం లక్ష్యం సరికొత్త ఉత్పత్తులను డెవలప్ చేయడంతోపాటు వేగంగా డెలివరీ చేయడం అని అన్నారు.
