- ఐపీఓ వస్తే మొత్తం ఇండస్ట్రీ వాల్యూ పెరుగుతుంది
- 5జీ స్పెక్ట్రమ్ రేట్లు తగ్గితేనే ఆక్షన్ సక్సెస్ అవుతుంది: సీఎల్‌ఎస్‌ఏ
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీఓ, ఈ ఏడాది ఉండొచ్చని బ్రోకరేజి కంపెనీ సీఎల్‌ఎస్‌ఏ అంచనావేసింది. జియో ఐపీఓకి వస్తే మాత్రం మొత్తం టెలికం సెక్టార్ వాల్యుయేషన్ మరింత పెరుగుతుందని అభిప్రాయపడింది. జియోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరు చేసి మార్కెట్‌లో లిస్టింగ్ చేస్తారనే వార్తలు గత రెండేళ్ల నుంచి షికారు కొడుతున్న విషయం తెలిసిందే. ‘ 5జీ స్పెక్ట్రమ్ ఆక్షన్, జియో మెగా పబ్లిక్ ఆఫర్ వంటి పెద్ద ఈవెంట్‌లు ఈ ఏడాది కనిపించొచ్చు. ఇప్పటికే జియోలో 33 శాతం వాటాను 13 మంది ఇన్వెస్టర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2020 లో సేల్ చేసింది. ఇందులో 10 శాతాన్ని ఫేస్‌బుక్‌కు, 8 శాతాన్ని గూగుల్‌కు అమ్మింది’ అని ఈ గ్లోబల్ బ్రోకరేజి కంపెనీ ఓ రీసెర్చ్ నోట్‌లో పేర్కొంది. జియో మొబైల్ బిజినెస్ వాల్యుయేషన్‌ను 99 బిలియన్ డాలర్లుగా (ఎంటర్‌ప్రైజ్ వాల్యూ) సీఎల్‌ఎస్‌ఏ అంచనావేస్తోంది. ఇందులో 5 బిలియన్ డాలర్ల విలువైన జియోఫైబర్ బిజినెస్ కూడా కలిసుంది. జియో ఐపీఓ మొత్తం టెలికం సెక్టార్ వాల్యూయేషన్‌ను పెంచుతుందని ఈ బ్రోకరేజి కంపెనీ అభిప్రాయపడింది. దేశ టెలికం సెక్టార్‌లో జియో లీడర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఐపీఓకు ముందే 20 బిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో కంపెనీ వాల్యుయేషన్ ప్రస్తుతం ఉన్న ఎంటర్‌ప్రైజ్ వాల్యూ కంటే 10 రెట్లు ఎక్కువగా పలుకుతోంది.
ఐపీఓకి ఇన్వెస్టర్లు ఎగబడతారు..
టెలికం సెక్టార్‌ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తాజాగా టెలికం రీఫామ్ ప్యాకేజిని ప్రకటించింది. అంతేకాకుండా కంపెనీలు కూడా టారిఫ్‌లను పెంచాయి. ఇలాంటి టైమ్‌లో జియో ఐపీఓకి వస్తే ఇన్వెస్టర్లు ఎగబడతారని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. రిలయన్స్ జియో పేరెంట్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే రూ. 1.52 లక్షల కోట్లను సేకరించగలిగింది. ఫేస్‌బుక్, గూగుల్, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్‌కమ్ వెంచర్స్ వంటి పెద్ద కంపెనీలు, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి టాప్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు జియోలో ఇన్వెస్ట్ చేశాయి.
5జీ స్పెక్ట్రమ్ రేట్లు తగ్గాలి..
ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్ బేస్ రేటును తగ్గించకపోతే, 5జీ ఆక్షన్ సక్సెస్ కాదని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. కిందటేడాది జరిగిన 4జీ స్పెక్ట్రమ్ ఆక్షన్ ద్వారా ప్రభుత్వం 11 బిలియన్ డాలర్లను సేకరించింది. 4జీ రెన్యూవల్ తప్పనిసరి కావడంతో ఈ ఆక్షన్ జరిగిన విషయం తెలిసిందే. కానీ, రానున్న 5జీ స్పెక్ట్రమ్ ఆక్షన్ సక్సెస్ కావాలంటే 3.3–3.6 గిగా హెడ్జ్ బ్యాండ్‌లో 100 మెగా హెడ్జ్‌కు 7 బిలియన్ డాలర్ల రేటును ప్రభుత్వం ఫిక్స్ చేయకూడదని, ఈ రేటు తగ్గించాలని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. 5జీ స్పెక్ట్రమ్ ధరలు తగ్గితే, ఆక్షన్ సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుందని, దీంతో ఈ సెక్టార్‌లో కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయని తెలిపింది. మొత్తం 5జీ స్పెక్ట్రమ్‌లో 10 బ్యాండ్‌లకు రిజర్వ్ ధరను నిర్ణయించడాన్ని కిందటి నెలలో ట్రాయ్ స్టార్ట్ చేసింది. ఇందులో 600 మెగా హెడ్జ్ బ్యాండ్ విడ్త్ కూడా ఉంది. 5జీ ఆక్షన్ ఈ ఏడాది ఏప్రిల్–మే లో ఉండొచ్చని అంచనా.
