- క్యూ3లో లాభం రూ.15,792 కోట్లు
- ఆదాయం రూ.2,20 లక్షల కోట్లు
- రిటెయిల్ లాభం రూ. 2,400 కోట్లు
- జియో లాభం రూ.4,638 కోట్లు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం డిసెంబర్ 2022 క్వార్టర్లో 15 శాతం తగ్గింది. ఈ నికర లాభం అంతకు ముందు ఏడాది క్యూ3 లోని రూ.18,549 కోట్ల నుంచి తాజా క్వార్టర్లో రూ. 15,792 కోట్లకు పడిపోయింది. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో కంపెనీ ఆయిల్ బిజినెస్ మార్జిన్లు పడిపోయాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. కానీ, తాజా క్యూ3 లో కంపెనీ ఆదాయం మాత్రం 15.3 శాతం పెరిగి రూ. 2.20 లక్షల కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ3 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం రూ. 1.91 లక్షల కోట్లు. నికరలాభం విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. శుక్రవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ. 20 వేల కోట్లను సమీకరించాలని కూడా నిర్ణయించారు. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశలలో ఈ ఫండ్స్ సేకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభం 15.6 శాతం పెరగగా, ఆదాయం 5.3 శాతం తగ్గింది. ఆయిల్ టూ కెమికల్ బిజినెస్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 10 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మొత్తం ఆదాయంలో ఇది 65 శాతానికి సమానమని పేర్కొంది. రిజల్ట్స్ అనౌన్స్మెంట్ నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.1 శాతం తగ్గి రూ. 2,443 వద్ద క్లోజయింది.
రిలయన్స్ రిటెయిల్ లాభం జూమ్..
రిలయన్స్ రిటెయిల్ నికర లాభం డిసెంబర్ 2022 క్వార్టర్లో 6.2% పెరిగి రూ. 2,400 కోట్లకు చేరింది. రెవెన్యూ అంతకు ముందు ఏడాది క్యూ3 లోని రూ. 57,717 కోట్ల నుంచి తాజా డిసెంబర్ క్వార్టర్లో రూ. 67,634 కోట్లకు చేరింది. తాజా క్వార్టర్లో కొత్తగా 789 స్టోర్లను తెరవడంతో, మొత్తం ఏరియా 60 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు రిలయన్స్ రిటెయిల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ చెప్పారు.
దుమ్ములేపిన జియో..
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లాభం డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ. 4,638 కోట్లకు పెరిగింది. 2021 లోని డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.3,615 కోట్లతో పోలిస్తే ఇది 28.3 శాతం ఎక్కువ. కంపెనీ రెవెన్యూ 19 శాతం పెరిగి రూ. 19,347 కోట్ల నుంచి రూ. 22,998 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ రెవెన్యూ రూ.23,300 కోట్లుగా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. కంపెనీ ఖర్చులు క్యూ3 లో 16 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ.7,227 కోట్లకు చేరుకున్నాయి. ఇబిటా ( ట్యాక్స్, వడ్డీ, తరుగుదల వంటివి తీసేయకముందు వచ్చిన లాభం) క్యూ3 లో రూ.12,009 కోట్లుగా, ఇబిటా మార్జిన్ 52.2 శాతంగా రికార్డయ్యింది. క్యూ3 లో కోత్తగా 70 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు యాడ్ అయ్యారని కంపెనీ పేర్కొంది. జియో రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) క్యూ3 లో 178.2 కి పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో ఇది 177.2 గా ఉంది.
