న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ.17,955 కోట్ల లాభం సంపాదించింది. పోయిన ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ.12,273 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ. ఈసారి రిలయన్స్‌కు రూ. 24,311 కోట్ల లాభం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలు నిజం కాలేదు. పోయిన ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,44,372 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్వార్టర్లో 54.54 శాతం పెరిగి రూ.2,23,113 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్ ఎబిటా 45.80 శాతం పెరిగి రూ.40,179 కోట్లకు చేరింది. నగదు లాభం 46.2 శాతం పెరిగి రూ.31,916 కోట్లకు ఎగిసింది. మార్జిన్ 17.3 శాతంగా ఉంది. పోల్ ప్రొజెక్షన్ కంటే ఇది 17 శాతం తక్కువ. నెగెటివ్ వాతావరణంలోనూ ఓ2 సీ వ్యాపారం ఈ క్వార్టర్ అత్యధిక ఆదాయాన్ని పొందిందని కంపెనీ తెలిపింది.
ఆదాయాల పరంగా రిలయన్స్ రిటైల్‌కు ఇదే అత్యుత్తమ క్వార్టర్ అని, సంవత్సరానికి 51.9 శాతం గ్రోత్తో రూ.58,554 కోట్లుగా ఉందని పేర్కొంది. జియో ప్లాట్‌ఫారమ్‌లకూ ఆదాయ పరంగా ఈ క్వార్టర్ ఉత్తమమైనదని, ఈ విభాగం నుంచి వచ్చే ఆదాయం 23.6 శాతం పెరిగి రూ. 27,527 కోట్లకు చేరిందని రిలయన్స్ తెలిపింది. జియో ప్లాట్‌ఫారమ్‌ల నికర లాభం 24.1 శాతం పెరిగి రూ. 4,530 కోట్లకు చేరుకుంది. అమ్మకాల విలువ 23.6 శాతం పెరిగి రూ. 27,527 కోట్లకు చేరుకుంది. ఏడాది లెక్కన ఇబిటా మార్జిన్ 176 బేసిస్ పాయింట్లు పెరిగి 48.7 శాతానికి చేరింది. కనెక్టివిటీ వ్యాపారంలో ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పెరుగుదల కారణంగా నిర్వహణ ఖర్చులను భరించడం సులువుగా మారింది. ఏఆర్పీయూ ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి నెలకు రూ. 175.70 లకు చేరింది. సీక్వెన్షియల్‌గా ఇది 4.8 శాతం పెరిగింది. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, యుద్ధం, రాజకీయ సమస్యల వల్ల ఇంధన మార్కెట్లలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. ధరలు తగ్గాయని, సంప్రదాయ ట్రేడ్ ఫ్లోలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
