తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్.. ఈ ఏడాది మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

హైదరాబాద్: తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 9.87 శాతం కేసులు పెరిగాయని డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 29) తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ నివేదికను ఆయను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,34,158 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 

మైనర్ ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.  జీరో డ్రగ్స్ స్టేట్గా తెలంగాణను నిలపాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని.. రాష్ట్రవ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 142.95 కోట్ల విలువ చేసే 20 టన్నుల డ్రగ్స్ సీజ్ చేశామని చెప్పారు. 48   డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని వెల్లడించారు.

Also Read : కొత్తసంవత్సర వేడుకలపై పోలీసులు నిఘా

 తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైం నేరాలు భారీగా పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 25,184 సైబర్ క్రైం కేసులు నమోదు కాగా.. 2023తో పోలిస్తే 43.33 శాతం మేర సైబర్ క్రైం నేరాలు పెరిగాయన్నారు. దేశంలోనే తొలిసారి రూ. 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుంచి విడిపించామని చెప్పారు. 2024లో 547 మంది ఎస్ఐలు, 12,338 మంది కానిస్టేబుళ్ల నియామకం చేపట్టామన్నారు.