శ్రీశైలం భక్తులకు శుభవార్త..

అమ్రాబాద్, వెలుగు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ అధికారులు వారం పాటు నిబంధనలు సడలించారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ డీఎఫ్​వో రోహిత్ గోపిడి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​లోని మన్ననూర్, దోమలపెంట ఫారెస్ట్  చెక్ పోస్టుల వద్ద ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వాహనాలను అనుమతినిస్తున్నామని, కానీ ఈ నెల 5 నుంచి 11 వరకు 24 గంటలు వెళ్లేందుకు పర్మిషన్​ ఇస్తున్నామన్నారు.  అలాగే ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6 నుంచి 10 వరకు 5 రోజుల పాటు ఇదే నిబంధన అమలవుతుందన్నారు.

అయితే, వాహనదారులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల స్పీడ్ గంటకు 40 కిలోమీటర్లు మించవద్దన్నారు. రూల్స్​ పాటించకపోతే ఫైన్ తో పాటు ఫారెస్ట్  యాక్ట్  ప్రకారం కేసు పెడతామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో అడవిలో హారన్​ కొట్టొద్దని, ఫారెస్ట్​లో ఎక్కడా ఆగొద్దన్నారు. కోతులు, ఇతర జంతువులకు పండ్లు, ఆహారం వేస్తే రూ. 1000 ఫైన్ వేస్తామన్నారు. పాదయాత్రగా వెళ్లే శివభక్తులు రాత్రి వేళల్లో అటవీ మార్గాన వెళ్లొద్దని, సాయంత్రానికి సమీప గ్రామాలకు చేరుకోవాలన్నారు. రోడ్డు మార్గంలో, అడవిలో బస చేయవద్దని సూచించారు. అడవిలో మం టలు పెట్టడం, వంటలు వండడం, పొగ తాగడం,   మద్యపానం నిషేధమన్నారు.